Food Poisoning : మటన్, పెరుగు కలిపి తిని భార్య మృతి..భర్త పరిస్థితి విషమం

Food Poisoning : మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోరం జరిగింది. మటన్, పెరుగు తిన్న వృద్ధ దంపతులు తీవ్ర ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారు. చికిత్స పొందుతూ భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది.

CR Reddy
Published on: 30 Jun 2026 8:48 AM IST
Food Poisoning
X

Food Poisoning 

Food Poisoning : మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో భయాందోళనలకు గురిచేసే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఉన్న బాగ్‌లాన్ తాలూకా ఆఖత్‌వాడే గ్రామంలో నివసించే ఒక వృద్ధ రైతు దంపతులు రాత్రి భోజనంలో మటన్, పెరుగు తిన్న తర్వాత తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. ఈ దురదృష్టకర ఘటనలో 68 ఏళ్ల వృద్ధురాలు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా, ఆమె 78 ఏళ్ల భర్త పరిస్థితి ప్రస్తుతం అత్యంత ఆందోళనకరంగా మారింది. ఈ సమాచారం చుట్టుపక్కల గ్రామాల్లో వ్యాపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

స్థానికులు, పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి ఆఖత్‌వాడే గ్రామానికి చెందిన శాంతారామ్ (78), ఆయన భార్య ద్వారకాబాయి (68) తమ ఇంట్లోనే ఎంతో ఇష్టంగా మటన్ కూర వండుకున్నారు. రాత్రి డిన్నర్ చేసే సమయంలో వారు మటన్ కూరతో పాటు పెరుగును కూడా నంజుకుని తిన్నారు. అయితే భోజనం ముగించిన కొద్దిసేపటికే ఆ దంపతులిద్దరికీ విపరీతమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. రాత్రి వేళ వారి పరిస్థితి క్రమంగా దిగజారడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళనతో వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చేరిన వృద్ధ దంపతులను రక్షించడానికి వైద్యులు తమ శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ.. తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా వృద్ధురాలు ద్వారకాబాయి చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరోవైపు ఆమె భర్త శాంతారామ్ ఆరోగ్య పరిస్థితి నిమిష నిమిషానికి విషమించడంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం మాలెగావ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ ICU వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతున్నారు.

మటన్, పెరుగు కాంబినేషన్ వల్లే మరణం సంభవించిందా?

ఈ దారుణ ఘటన తర్వాత, మటన్ తిన్న వెంటనే పెరుగు తినడం వల్లే అది శరీరంలో విషంగా మారి ప్రాణాలు తీసిందా అనే చర్చ స్థానికంగా జోరందుకుంది. అయితే ఈ విషయంపై వైద్యులు మరియు ఆహార నిపుణులు పూర్తి భిన్నంగా స్పందిస్తున్నారు. కేవలం మటన్, పెరుగులను కలిపి తినడం మాత్రమే మరణానికి కారణం కాలేదని వారు స్పష్టం చేస్తున్నారు. దీనికి అసలు కారణం తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ మాత్రమేనని వారు అంచనా వేస్తున్నారు. అయితే వారు వండుకున్న మటన్ పాడైపోయి ఉండొచ్చని లేదా వారు వాడిన పెరుగులో ప్రమాదకరమైన బ్యాక్టీరియా చేరి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ముఖ్యంగా వేసవి, ఉక్కపోత ఎక్కువగా ఉండే వాతావరణంలో వండిన ఆహార పదార్థాలు చాలా త్వరగా బ్యాక్టీరియా బారిన పడి విషపూరితంగా మారుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పూణే ల్యాబ్‌కు చేరిన నమూనాలు

ఈ ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న స్థానిక యంత్రాంగం, పోలీస్ శాఖ వెంటనే రంగంలోకి దిగింది. పోలీసులు బాధితుల ఇంటికి చేరుకుని ఆ రాత్రి వారు వండుకున్న మటన్ కూర, పెరుగుతో పాటు వారు తిన్న వంట పాత్రలను కూడా సీజ్ చేశారు. ఈ ఆహార నమూనాలను పూర్తి స్థాయి రసాయన విశ్లేషణ కోసం పూణేలోని ప్రభుత్వ ల్యాబ్‌కు (ఫొరెన్సిక్ ల్యాబ్) పంపించారు. పోస్ట్‌మార్టం నివేదికతో పాటు పూణే ల్యాబ్ నుంచి వచ్చే ఫుడ్ రిపోర్టు ఆధారంగానే వృద్ధురాలి మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని స్థానిక పోలీస్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి పోలీసులు దీనిని ప్రమాద వశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story