Bank Strike: బ్యాంకింగ్ రంగంలో సమ్మె సైరన్.. ఈ నెల11న బ్యాంకుల బంద్!
Bank Strike: 5 రోజుల పని విధానం ఆమోదం, PLI సవరణలపై అసంతృప్తితో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది.
Bank Strike: బ్యాంకింగ్ రంగంలో సమ్మె సైరన్.. ఈ నెల11న బ్యాంకుల బంద్!
Nation-Wide Bank Strike: సెప్టెంబర్ 11 నుంచి నిరసనల పర్వం! దేశంలోని దాదాపు 90 శాతానికి పైగా బ్యాంకింగ్ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 'యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్' కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ విధానాలకు నిరసనగా దేశవ్యాప్త పోరాటానికి పిలుపునిచ్చింది.
రెండేళ్లుగా పరిష్కారానికి నోచుకోని ‘5 రోజుల పని విధానం’తో పాటు, కొత్తగా తీసుకొచ్చిన విపరీత వ్యత్యాసాలతో కూడిన పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల సవరణలపై బ్యాంకింగ్ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2024 మార్చిలో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం, అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటిస్తే, సోమవారం నుండి శుక్రవారం వరకు రోజూ అదనంగా 40 నిమిషాలు పనిచేసేందుకు ఉద్యోగులు అంగీకరించారు. ఆర్‌బీఐ, ఎల్ఐసీ, నాబార్డ్ వంటి ప్రధాన ఆర్థిక సంస్థల్లో ఇప్పటికే 5 రోజుల పని విధానం అమల్లో ఉంది.
బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి భంగం కలగకుండా సమయం పెంచినా, ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని ఆమోదించకుండా రెండేళ్లుగా పెండింగ్‌లో పెట్టడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
2020 ఒప్పందం ప్రకారం హౌస్‌కీపింగ్ సిబ్బంది నుండి జనరల్ మేనేజర్ల వరకు అందరికీ పనితీరు ఆధారంగా సమానంగాప్రోత్సాహకం లభించేది. అయితే, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెచ్చిన నూతన నిబంధనల ప్రకారం, కేవలం 5 శాతం ఉండే సీనియర్ అధికారులకు ఏకంగా 365 రోజుల వేతనం వరకు ప్రోత్సాహకాలు పొందే అవకాశం కల్పించారు. మిగిలిన 95 శాతం మంది సిబ్బందిని కేవలం 15 రోజులకే పరిమితం చేయడం తీవ్ర వివక్ష పూరితమని, దీనిని తక్షణమే ఉపసంహరించుకోవాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
తమ డిమాండ్లు నెరవేర్చకపోతే దశలవారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఏడు ప్రధాన బ్యాంక్ యూనియన్ల కూటమి స్పష్టం చేసింది. సెప్టెంబర్ 11న ఒక రోజు దేశవ్యాప్త సూచనాత్మక సమ్మె. సెప్టెంబర్ 28 నుండి 30 వరకు మూడు రోజుల పాటు వరుస సమ్మె.
అక్టోబర్ 26 నుండి ముగింపు లేని నిరవధిక సమ్మెగా రూపాంతరం చెందుతుంది. ఏకరీతి ప్రోత్సాహక విధానాన్ని పునరుద్ధరించి, కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని, లేనిపక్షంలో లావాదేవీలు నిలిచిపోవడానికి ప్రభుత్వ వైఖరే కారణమవుతుందని యూనియన్ నేతలు హెచ్చరించారు.




