National Handloom Day 2026: శతాబ్ధాలనాటి చేనేత కళ... సరికొత్త ఆవిష్కరణలతో అద్భుతాలు సృష్టిస్తున్న హ్యాండ్‌లూమ్స్
భారతీయ చేనేతకు కేంద్రం ప్రోత్సాహం అందిస్తోంది. శతాబ్దాలనాటి కళను తిరిగి సరికొత్తగా ఆవిష్కరించడమే కాకుండా ప్రపంచ వేదికలపై తన సత్తాను చాటుతోంది.
National Handloom Day 2026: భారతీయ సంస్కృతి గురించి ప్రపంచం మాట్లాడినప్పుడు యోగా, ఆయుర్వేదంతో పాటు చేనేతకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. వేల ఏళ్ల చరిత్రను తనలో దాచుకున్న భారత చేనేత కళ నేటికీ తన ప్రత్యేకతను కోల్పోకుండా ప్రపంచ మార్కెట్‌లో తనదైన ముద్ర వేస్తోంది. సంప్రదాయానికి ఆధునికతను జోడిస్తూ కొత్త తరానికి చేరువవుతోంది. ఈ గొప్ప వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది నేత కార్మికుల కృషికి గౌరవం తెలిపేందుకు ప్రతి ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ దినోత్సవం భారత చేనేత వారసత్వాన్ని మాత్రమే కాదు, స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని కూడా స్మరింపజేస్తుంది.
స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా చేనేత దినోత్సవం
జాతీయ చేనేత దినోత్సవానికి చారిత్రక నేపథ్యం ఉంది. 1905 ఆగస్టు 7న కోల్‌కతా టౌన్‌హాల్‌లో స్వదేశీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. విదేశీ వస్తువులను బహిష్కరించి, భారతీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ ఉద్యమంలో చేనేత కీలక పాత్ర పోషించింది. భారత నేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను ప్రజలు విస్తృతంగా ఉపయోగించడం ద్వారా స్వావలంబనకు బాటలు పడ్డాయి. ఈ చారిత్రక ఘటనకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. తొలి చేనేత దినోత్సవాన్ని 2015లో నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
చేనేత... కోట్లాది కుటుంబాల జీవనాధారం
చేనేత అనేది కేవలం వస్త్రాల తయారీ పరిశ్రమ మాత్రమే కాదు. ఇది కోట్లాది మంది గ్రామీణ కుటుంబాలకు జీవనాధారం. 2019-20 చేనేత జనగణన ప్రకారం దేశంలో 35.22 లక్షల మంది చేనేత కార్మికులు, అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నారు. వారిలో 25.46 లక్షల మంది మహిళలు, అంటే మొత్తం కార్మికుల్లో 72 శాతానికి పైగా మహిళలే ఉండటం ఈ రంగం సామాజిక ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. దేశవ్యాప్తంగా 28.20 లక్షల హ్యాండ్‌లూమ్స్ ఉండగా, వాటిలో దాదాపు 90 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అందువల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో చేనేత రంగం కీలక పాత్ర పోషిస్తోంది.
సంప్రదాయానికి ఆధునికత జోడిస్తున్న ప్రభుత్వం
మారుతున్న కాలానికి అనుగుణంగా చేనేత రంగాన్ని ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోంది. నేషనల్ హ్యాండ్‌లూమ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతులు, ఆధునిక డిజైన్లు, మార్కెటింగ్‌కు ఆర్థిక సహాయం అందిస్తోంది. అలాగే యార్న్ సప్లై స్కీమ్, రా మెటీరియల్ సప్లై స్కీమ్, హ్యాండ్‌లూమ్ మార్కెటింగ్ అసిస్టెన్స్, వీవర్ ముద్రా పథకం వంటి పథకాల ద్వారా నేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. అంతేకాదు, 2021 నుంచి 2026 జూన్ వరకు 357 హ్యాండ్‌లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేయగా, 200 హ్యాండ్‌లూమ్ ప్రొడ్యూసర్ కంపెనీలు స్థాపించబడ్డాయి. ఆధునిక వర్క్‌షెడ్లు, ఎలక్ట్రానిక్ జాకార్డ్ యంత్రాల వినియోగంతో ఉత్పత్తి సామర్థ్యం 53 శాతం పెరిగింది. నెలవారీ సగటు ఆదాయం రూ.9,600 నుంచి రూ.15,000కు పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ప్రపంచ మార్కెట్‌లో భారత చేనేతకు పెరుగుతున్న గుర్తింపు
ఒకప్పుడు స్థానిక మార్కెట్‌కే పరిమితమైన భారత చేనేత నేడు అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచంలోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తోంది. 2025-26లో భారత చేనేత ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ.1,330.96 కోట్లకు చేరుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, స్పెయిన్ వంటి దేశాలు ప్రధాన కొనుగోలుదారులుగా నిలిచాయి. వినియోగదారుల్లో నమ్మకం పెంచేందుకు హ్యాండ్‌లూమ్ మార్క్, ఇండియా హ్యాండ్‌లూమ్ బ్రాండ్, జీఐ ట్యాగ్ వంటి గుర్తింపులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే 106 చేనేత ఉత్పత్తులకు జీఐ గుర్తింపు లభించింది.
దేశ గర్వంగా నిలిచిన చేనేత సంప్రదాయాలు
భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన చేనేత వారసత్వం ఉంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బనారసీ సిల్క్, తమిళనాడులోని కాంచీపురం పట్టు, తెలంగాణ పోచంపల్లి ఇకత్, ఒడిశా సంబల్‌పురి ఇకత్, అస్సాం ముగా సిల్క్, కేరళ కసవు, మహారాష్ట్ర పైఠాణీ, మధ్యప్రదేశ్ చందేరి, పశ్చిమ బెంగాల్ జామ్‌దాని వంటి చేనేత ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్నాయి. ఇవి కేవలం వస్త్రాలు మాత్రమే కాదు, ఆయా ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, కళాత్మక నైపుణ్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.
సాంకేతికతతో కొత్త అవకాశాలు
చేనేత రంగాన్ని యువతకు చేరువ చేసేందుకు ప్రభుత్వం వినూత్న చర్యలు చేపడుతోంది. హ్యాండ్‌లూమ్ హ్యాకథాన్-2026 ద్వారా విద్యార్థులు, స్టార్టప్‌లు, డిజైనర్లు, పరిశోధకులు కలిసి కొత్త డిజైన్లు, డిజిటల్ మార్కెటింగ్, సుస్థిర ఉత్పత్తి విధానాలపై ఆవిష్కరణలు చేయడానికి అవకాశం కల్పిస్తోంది. అలాగే విశ్వసూత్ర, భారత్ టెక్స్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వంటి వేదికలపై భారత చేనేతను ప్రపంచానికి పరిచయం చేస్తోంది.
కేవలం చీర కాదు... దేశ ఆత్మగౌరవం
చేనేత వస్త్రం కొనడం అంటే ఒక వస్త్రాన్ని కొనడం మాత్రమే కాదు. ఒక నేత కుటుంబానికి ఉపాధి కల్పించడం, భారతీయ సంప్రదాయాన్ని కాపాడటం, పర్యావరణహిత ఉత్పత్తులను ప్రోత్సహించడం కూడా. తక్కువ విద్యుత్ వినియోగం, సహజ పదార్థాల వినియోగంతో తయారయ్యే చేనేత వస్త్రాలు సుస్థిర అభివృద్ధికి కూడా తోడ్పడుతున్నాయి. అందుకే వోకల్ ఫర్ లోకల్ ఉద్యమంలో చేనేతకు ప్రత్యేక ప్రాధాన్యం దక్కుతోంది. జాతీయ చేనేత దినోత్సవం ఒక అధికారిక కార్యక్రమం మాత్రమే కాదు. భారతీయ సంప్రదాయం, స్వదేశీ స్ఫూర్తి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, లక్షలాది నేత కుటుంబాల జీవితాలకు అద్దం పట్టే సందర్భం. ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూనే, శతాబ్దాలనాటి కళను భవిష్యత్ తరాలకు అందించడం ఈ దినోత్సవం ప్రధాన సందేశంగా నిలుస్తోంది.




