ఉద్ధవ్ థాకరే 'కాషాయం, అధికార మార్పిడి' వ్యాఖ్యలపై ఎన్డీయే తీవ్ర విమర్శలు!

దసరా సభలో ఉద్ధవ్ థాకరే చేసిన కాషాయ గుర్తింపు, అధికార మార్పిడి వ్యాఖ్యలపై ఎన్డీయే నేతలు తీవ్రంగా స్పందించారు.

Arun Chilukuri
Published on: 21 Oct 2026 5:27 PM IST
ఉద్ధవ్ థాకరే కాషాయం, అధికార మార్పిడి వ్యాఖ్యలపై ఎన్డీయే తీవ్ర విమర్శలు!
X

ఉద్ధవ్ థాకరే 'కాషాయం, అధికార మార్పిడి' వ్యాఖ్యలపై ఎన్డీయే తీవ్ర విమర్శలు!

శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే ఇటీవల చేసిన 'అధికార మార్పిడి', 'కాషాయ గుర్తింపు' వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ముంబైలోని చరిత్రాత్మక శివాజీ పార్క్‌లో దసరా సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎన్డీయే కూటమి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన ద్వంద్వ వైఖరిని ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని, ఎన్నికల్లో తిరస్కరించడం ఖాయమని స్పష్టం చేశారు.

దసరా సభలో ఉద్ధవ్ థాకరే ఏమన్నారంటే?:

దసరా ర్యాలీలో ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ.. తాము కేవలం అధికార మార్పిడి కోసమే రాజకీయాల్లో ఉన్నామని, ప్రజా ప్రయోజనాలను విస్మరించే ఏ ప్రభుత్వాన్నైనా మార్చి తీరాలని పిలుపునిచ్చారు. "కాషాయం మా గుర్తింపు. దాన్ని ఎవరూ మా నుంచి దొంగిలించలేరు. ఈ పవిత్ర కాషాయ పతాకాన్ని మహారాష్ట్ర అసెంబ్లీపైనే కాకుండా, ఢిల్లీ పీఠంపై కూడా ఎగరేయాలి" అని ఉద్ఘాటించారు.

ఎన్డీయే నేతల ఘాటు ఎదురుదాడి:

ఉద్ధవ్ వ్యాఖ్యలపై బీజేపీ, శివసేన (షిండే వర్గం) నేతలు తీవ్రంగా స్పందించారు:

రామ్ కదమ్ (బీజేపీ ఎమ్మెల్యే): "ఉద్ధవ్ ప్రసంగంలో 'ఆపరేషన్ టైగర్ 3' భయం స్పష్టంగా కనిపిస్తోంది. హిందుత్వాన్ని వీడినందుకు ఆయనలో పశ్చాత్తాపం కొట్టొచ్చినట్లు కనపడటంతోనే పదేపదే కాషాయం, శివాజీ పేర్లను ఉచ్ఛరిస్తున్నారు. సనాతన ధర్మాన్ని కించపరిచే రాహుల్ గాంధీతో జతకట్టడం, అఫ్జల్ గురును వెనకేసుకొచ్చే వారికి మద్దతివ్వడం ఉద్ధవ్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం" అని విమర్శించారు.

షైనా ఎన్సీ (శివసేన అధికార ప్రతినిధి): "ఉద్ధవ్ 'స్కార్ఫ్ ధరించే' హిందుత్వం వద్దంటారు. మరి 2019లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు 'టోపీ ధరించే' సెక్యులరిజాన్ని ఎలా స్వీకరించారు? బాలాసాహెబ్ థాకరే గర్వంగా హిందువులమని చెప్పమంటే, ఉద్ధవ్ మాత్రం గర్వంగా అధికార మార్పిడి కోసం పనిచేయాలని చెబుతున్నారు. ఒకరిది నిజమైన హిందుత్వం అయితే, మరొకరిది నకిలీ సెక్యులరిజం" అని దుయ్యబట్టారు.

మిలింద్ దేవరా (రాజ్యసభ సభ్యుడు): ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉన్నప్పటికీ, విదేశీ పరిస్థితులతో పోల్చుతూ అశాంతిని, హింసను ప్రేరేపించేలా ఉద్ధవ్ భాష ఉందని మండిపడ్డారు. మార్పు రావాలంటే అల్లర్ల ద్వారా కాకుండా, ప్రజల ఓట్ల ద్వారా ప్రజాస్వామ్య బద్ధంగా రావాలని హితవు పలికారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.