రాష్ట్రపతితో భేటీ వివరాలు బహిర్గతం చేయడంపై ఎన్డీఏ ఆగ్రహం.. రాహుల్ గాంధీ తీరుపై తీవ్ర అభ్యంతరం!

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో జరిగిన భేటీ వివరాలను బహిరంగంగా వెల్లడించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఎన్డీఏ కూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Arun Chilukuri
Published on: 10 Oct 2026 12:19 PM IST
రాష్ట్రపతితో భేటీ వివరాలు బహిర్గతం చేయడంపై ఎన్డీఏ ఆగ్రహం.. రాహుల్ గాంధీ తీరుపై తీవ్ర అభ్యంతరం!
X

రాష్ట్రపతితో భేటీ వివరాలు బహిర్గతం చేయడంపై ఎన్డీఏ ఆగ్రహం.. రాహుల్ గాంధీ తీరుపై తీవ్ర అభ్యంతరం!

ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ నియామకం, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) వివాదాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని 'ఇండియా' కూటమి ప్రతినిధి బృందం ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రపతితో జరిగిన భేటీ తాలూకు వివరాలను, ఆమె తమతో అన్నట్లుగా రాహుల్ గాంధీ బహిరంగంగా వెల్లడించడంపై జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) తీవ్రంగా మండిపడింది. రాజ్యాంగ పదవి గౌరవాన్ని దిగజార్చేలా రాహుల్ వ్యవహరిస్తున్నారని ఎన్డీఏ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ.. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతితో జరిగిన సంభాషణ వివరాలను బయటపెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. "రాష్ట్రపతితో ఏం చర్చించారో బయటపెట్టడం రాజ్యాంగ పదవి గౌరవానికి సంబంధించిన ఆందోళనలను రేకెత్తిస్తుంది. ప్రతిపక్ష నేతగా ఆమెను కలిసే హక్కు ఆయనకు ఉంది, కానీ ఆమె ఏం చెప్పారో బహిరంగంగా వ్యాఖ్యానించే హక్కు లేదు. ఆయన చెబుతున్నవి అబద్ధం కూడా కావచ్చు" అని మండిపడ్డారు.

బిహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సరౌగి విపక్షాల ఆరోపణలను తప్పుబడుతూ.. "రాష్ట్రపతిని కలవడం రాజ్యాంగ హక్కే, కానీ మీరు ఏమైనా బలమైన సాక్ష్యాలు సమర్పించారా? ఎన్నికల జాబితాల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై ఎలాంటి ఆధారాలు చూపకుండా రాద్ధాంతం చేస్తున్నారు. ఈ ప్రక్రియకు 150 రోజులు పడుతుంది, అభ్యంతరాల కోసం నెల రోజుల సమయం ఇస్తారు" అని స్పష్టం చేశారు.

జేడీయూ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ప్రతి పార్టీకి ఉంటుందని, అయితే విపక్షాలు తమ రాజకీయ వైఖరి, ప్రజలతో ఉన్న సంబంధంపై ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

ఈ ప్రతినిధి బృందంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, ఎన్సీపీ-ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ వ్యవహారశైలి, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో విపక్షాలు గత కొన్ని రోజులుగా తీవ్ర నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.