NEET: నీట్‌ పేపర్‌ లీక్‌ కలకలం: 100 ప్రశ్నలు ముందే వెల్లడి?

NEET: నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలపై రాజస్థాన్ ఎస్‌వోజీ దర్యాప్తు ప్రారంభించింది. 100 ప్రశ్నలు ముందే సర్క్యులేట్ అయ్యాయన్న వార్తలను ఎన్టీయే ఖండించింది.

Arun Chilukuri
Published on: 12 May 2026 6:23 AM IST
NEET
X

NEET: నీట్‌ పేపర్‌ లీక్‌ కలకలం: 100 ప్రశ్నలు ముందే వెల్లడి?

NEET: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఈ నెల 3న జరిగిన పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్‌లో 100 ప్రశ్నలు పరీక్షకు ముందే బయట సర్క్యులేట్ అయ్యాయన్న వార్తలపై రాజస్థాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) దర్యాప్తును వేగవంతం చేసింది.

దర్యాప్తులో భాగంగా రాజస్థాన్ పోలీసులు ఒక బుక్‌లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో దాదాపు 400కు పైగా ప్రశ్నలు ఉండగా, వాటిలో బయాలజీ మరియు కెమిస్ట్రీకి సంబంధించిన 100 ప్రశ్నలు ఒరిజినల్ నీట్ పేపర్‌లోని ప్రశ్నలను పోలి ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఇది పక్కాగా లీకేజీయేనా లేక కోచింగ్ సెంటర్లు ఇచ్చే గెస్ పేపర్ల కారణంగా జరిగిన యాదృచ్ఛిక సంఘటనా అన్న కోణంలో పోలీసులు విశ్లేషిస్తున్నారు. దీని వెనుక ఏదైనా వ్యవస్థీకృత ముఠా ఉందా అనే కోణంలో రాజస్థాన్ మరియు ఉత్తరాఖండ్‌లో సోదాలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు, పేపర్ లీక్ ఆరోపణలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తీవ్రంగా ఖండించింది. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అత్యున్నత భద్రతా ప్రమాణాల మధ్య పరీక్షను పూర్తి చేశామని స్పష్టం చేసింది. సోమవారం విడుదల చేసిన సుదీర్ఘ ప్రకటనలో, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిరాధారమని కొట్టిపారేసింది.

ఈ ఏడాది నీట్ పరీక్షకు భారత్‌తో పాటు విదేశాల నుండి సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకవేళ లీక్ నిజమని తేలితే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో విద్యార్థి లోకం ఆందోళన చెందుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story