Delhi Police: నీట్ నిరసనల్లో బలప్రయోగం చేయలేదు.. సుప్రీంకోర్టులో దిల్లీ పోలీసుల అఫిడవిట్!
Delhi Police: నీట్ పేపర్ లీక్ నిరసనల్లో పోలీసు చర్యలపై సుప్రీంకోర్టులో దిల్లీ, బిహార్ పోలీసుల అఫిడవిట్.
Delhi Police: నీట్ నిరసనల్లో బలప్రయోగం చేయలేదు.. సుప్రీంకోర్టులో దిల్లీ పోలీసుల అఫిడవిట్!
Delhi Police: జులై 20న నీట్ (NEET) పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘చలో పార్లమెంట్’ మార్చ్‌లో విద్యార్థులపై అక్రమంగా ఎలాంటి బలప్రయోగం చేయలేదని దిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. నిరసనకారులపై భద్రతా బలగాలు వ్యవహరించిన తీరుపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో దిల్లీ, బిహార్ పోలీసులు వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేశారు.
దిల్లీ పోలీసుల అఫిడవిట్ ముఖ్యాంశాలు
'చలో పార్లమెంట్' మార్చ్‌కి ఎలాంటి అధికారిక అనుమతి లేదని, చట్టవిరుద్ధంగా నిరసనకారులు పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారని పోలీసులు పేర్కొన్నారు. ఆ రోజు సుమారు 30,000 మంది నిరసనకారులు 3 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నారని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం 5,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు.
ఆందోళనకారులు బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు యత్నించడంతోనే అదుపు చేయాల్సి వచ్చిందని వివరించారు. ఈ ఘర్షణలో 240 మంది భద్రతా సిబ్బంది గాయపడగా, 200 మంది నిరసనకారులు వైద్య చికిత్స పొందినట్లు వెల్లడించారు. నిరసనకారుల గుంపులో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, సంఘ విద్రోహ శక్తులు కలిసిపోయారని దిల్లీ పోలీసులు ఆరోపించారు.
బిహార్‌లో ఏకే-47 కాల్పుల ఘటనపై స్పష్టత
బిహార్‌లోని సివాన్‌లో విద్యార్థుల ఆందోళనల సందర్భంగా ఓ కానిస్టేబుల్ ఏకే-47 తుపాకీని ఎక్కుపెట్టిన వీడియో నెట్టింట తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై బిహార్ పోలీసులు సుప్రీంకోర్టుకు వివరణ ఇస్తూ.. ఆందోళనకారుల గుంపులో సదరు కానిస్టేబుల్ చిక్కుకుపోవడంతో ఆత్మరక్షణార్థం గాల్లోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారని తెలిపారు. ఈ గాల్లో కాల్పుల వల్ల ఎవరూ గాయపడలేదని బిహార్ పోలీసులు తమ అఫిడవిట్‌లో స్పష్టం చేశారు.




