Sonia Sehrawat: విద్యార్థులను 'బొద్దింకలు' అన్న RAF లేడీ ఆఫీసర్.. నీట్ ఆందోళనల్లో తీవ్ర వివాదం!
Sonia Sehrawat: నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంట్ మార్చ్ చేపట్టిన విద్యార్థులను ఉద్దేశించి ఆర్ఏఎఫ్ అధికారిణి సోనియా సెహ్రావత్ ఇన్‌స్టాగ్రామ్‌లో 'బొద్దింకలు' అని పోస్ట్ చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.
Sonia Sehrawat: విద్యార్థులను 'బొద్దింకలు' అన్న RAF లేడీ ఆఫీసర్.. నీట్ ఆందోళనల్లో తీవ్ర వివాదం!
Sonia Sehrawat: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) అధికారిణి సోనియా సెహ్రావత్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఉద్దేశించి ఆమె 'బొద్దింకలు' అని సంబోధించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు 'పార్లమెంట్ మార్చ్' నిర్వహించారు. ఈ నిరసనల క్రమంలో భద్రతా బందోబస్తు విధుల్లో ఉన్న ఆర్ఏఎఫ్ అధికారిణి సోనియా సెహ్రావత్, తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చనిపోయిన ఒక బొద్దింక ఫొటోను షేర్ చేశారు. దానికి జతగా.. "తమను తాము సరిదిద్దుకోలేరు కానీ, దేశాన్ని బాగుచేయాలని చూస్తున్నారు" అంటూ క్యాప్షన్ రాశారు.
ఈ పోస్ట్‌పై విద్యార్థులు, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆమె వెంటనే దానిని తొలగించారు. సోనియా వ్యాఖ్యలపై ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా అత్యంత ఘాటుగా స్పందించింది. "శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని ఒక ఆర్ఏఎఫ్ అధికారిణి బొద్దింకలతో పోల్చడం దిగ్భ్రాంతికరం. అయినా మేం బొద్దింకలమే.. బొద్దింకలకు చావుండదు" అంటూ సవాల్ విసిరింది.
సర్వీస్ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న అధికారులు వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం గానీ, సీఆర్పీఎఫ్ / ఆర్ఏఎఫ్ యూనిఫామ్‌లో ఉన్న ఫొటోలను ప్రొఫైల్ పిక్చర్‌గా ఉంచడం గానీ నిషిద్ధం. అయితే సోనియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో యూనిఫామ్ ఫొటోనే ప్రొఫైల్‌గా పెట్టుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హర్యానాకు చెందిన సోనియా సెహ్రావత్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తరచూ తన బైక్ రైడింగ్, వర్కవుట్ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు.




