Gitanjali Angmo: కాంగ్రెస్ నిరసనల్లో చిత్తశుద్ధి లేదు.. సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఫైర్!

Gitanjali Angmo: నీట్ పేపర్ లీక్‌పై ప్రధాని మోడీ నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక చేసిన మెరుపు ధర్నాపై ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో తీవ్ర విమర్శలు చేశారు.

Arun Chilukuri
Published on: 23 July 2026 4:03 PM IST
Gitanjali Angmo
X

Gitanjali Angmo: కాంగ్రెస్ నిరసనల్లో చిత్తశుద్ధి లేదు.. సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఫైర్!

Gitanjali Angmo: నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంలో ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆందోళనలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒకవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తోంది. మరోవైపు ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆసుపత్రిలోనే తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలపై సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో తీవ్ర విమర్శలు గుప్పించారు.

జాతీయ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గీతాంజలి ఆంగ్మో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. "కాంగ్రెస్ చేసిన ఈ నిరసనలో ఎలాంటి తీవ్రతగానీ, చిత్తశుద్ధిగానీ లేదు. ప్రధాని ఇంటి ముందు ధర్నాలు చేయడం కంటే, కాంగ్రెస్ నాయకులు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను కలిసి వారికి మద్దతుగా నిలిచి ఉంటే బాగుండేది" అని అభిప్రాయపడ్డారు.

ప్రధాని నివాసం వద్ద జరిగిన నిరసనలు కేవలం ప్రజలను మోసగించడానికేనని గీతాంజలి మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం నిజాయితీ లేని నాటకాలు ఆడితే యువత అలాంటి వారిని తరిమికొడుతుందని హెచ్చరించారు.

సొమవారం నాటి 'పార్లమెంట్ మార్చ్' సందర్భంగా పోలీసులు, నిరసనకారులకు మధ్య ఘర్షణ జరిగి, లాఠీఛార్జ్‌కు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ పోలీసుల అణచివేతకు నిరసనగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మరియు ఇతర కీలక నాయకులు ప్రధాని మోడీ నివాసం వద్ద మెరుపు ధర్నా చేపట్టారు. దీనిపైనే గీతాంజలి స్పందించారు.

ఈ విద్యార్థి ఉద్యమం పూర్తిగా రాజకీయాలకు అతీతమైనదని గీతాంజలి స్పష్టం చేశారు. "ఈ పోరాటం ద్వారా నాయకులకు ఓ స్పష్టమైన సందేశం వెళ్తోంది.. మాకు మాటలు కాదు, చేతలు కావాలి. మా దృష్టిలో ప్రభుత్వం, ప్రతిపక్షం అనే తేడా లేదు. పార్లమెంట్ అనేది అత్యున్నతమైన వ్యవస్థ, విద్యా రంగాన్ని ప్రాథమికాంశంగా పరిగణించి పరిష్కారం చూపాలి. స్వార్థ రాజకీయాల కోసం ఈ విద్యార్థి ఉద్యమాన్ని వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను" అని ఆమె పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story