NEET UG re-test 2026: ఎన్టీఏ మరో దారుణం.. నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ పరీక్ష కేంద్రం!
NEET UG re-test 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్‌లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఘోర తప్పిదం.
NEET UG re-test 2026: ఎన్టీఏ మరో దారుణం.. నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ పరీక్ష కేంద్రం!
NEET UG re-test 2026: జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరోసారి ఘోర తప్పిదంతో వార్తల్లోకెక్కింది. నీట్ యూజీ (NEET UG 2026) రీ-ఎగ్జామినేషన్‌లో భాగంగా నాగ్‌పూర్‌కు చెందిన ఒక విద్యార్థికి ఏకంగా యూఏఈలోని అబుదాబిలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించి తీవ్ర గందరగోళానికి తెరలేపింది. రేపే (ఆదివారం) ఈ పరీక్ష జరగాల్సి ఉండడంతో సదరు విద్యార్థి, అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన అబ్దుల్లా అనే విద్యార్థి నీట్ రీ-ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎగ్జామ్ అప్లికేషన్ ఫారంలో తన ప్రాధాన్యత కేంద్రాలుగా (Preference Centres) స్థానికంగా ఉండే నాగ్‌పూర్, వార్థా, భండారా నగరాలను ఎంచుకున్నాడు. అయితే, ఎన్టీఏ జారీ చేసిన అడ్మిట్ కార్డు (Admit Card) చూసి అబ్దుల్లా కుటుంబం ఒక్కసారిగా నివ్వెరపోయింది. ఆ హాల్ టికెట్‌లో విద్యార్థి నివాసానికి వేల కిలోమీటర్ల దూరంలో, ఏకంగా విదేశాల్లోని అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయించి ఉంది.
ఈ ఘటనపై ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడిన విద్యార్థి తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "మేము ఎంతో జాగ్రత్తగా నాగ్‌పూర్ చుట్టుపక్కల ప్రాంతాలనే సెంటర్లుగా ఎంచుకున్నాము. కానీ విదేశాల్లో సెంటర్ ఎలా కేటాయించారో మాకు అర్థం కావడం లేదు. అసలు నా కొడుక్కి పాస్‌పోర్ట్ కూడా లేదు. రేపే పరీక్ష ఉన్న నేపథ్యంలో.. ఇప్పుడు అత్యవసరంగా పాస్‌పోర్ట్, వీసా సంపాదించి విదేశాలకు వెళ్లడం ఎలా సాధ్యమవుతుంది?" అని వారు వాపోయారు.
ఈ విషయం తెలుసుకున్న మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ అనీస్ అహ్మద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఏ పరీక్షల నిర్వహణను ఒక అపహాస్యంగా మార్చేసిందని ఆయన మండిపడ్డారు. విద్యార్థి భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని విమర్శిస్తూ.. వెంటనే ఈ పొరపాటును సరిదిద్ది, నాగ్‌పూర్‌లోనే కొత్త అడ్మిట్ కార్డు జారీ చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు.
మరోవైపు విద్యార్థి తల్లిదండ్రులు వెంటనే ఎన్టీఏ హెల్ప్‌లైన్‌ను సంప్రదించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్టీఏ అధికారులు, కేవలం సాంకేతిక లోపం (Technical Glitch) వల్లే ఇలా జరిగిందని అంగీకరించారు.
ఈ వ్యవహారంపై తాను స్వయంగా ఎన్టీఏ ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు డాక్టర్ అనీస్ అహ్మద్ వెల్లడించారు. నిన్న రాత్రి జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఎన్టీఏ దిగివచ్చిందని, విద్యార్థికి నాగ్‌పూర్‌లోనే పరీక్షా కేంద్రం కేటాయిస్తామని స్పష్టం చేసిందన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల కల్లా సవరించిన (Revised) కొత్త అడ్మిట్ కార్డును ఆన్‌లైన్‌లో జారీ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని ఆయన వివరించారు.
ఎన్టీఏ హామీతో విద్యార్థి కుటుంబం ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ఈ ఘటన సదరు సంస్థ పనితీరుపై దేశవ్యాప్తంగా మరోసారి తీవ్రమైన సందేహాలను రేకెత్తించింది. ఇప్పటికే పలు పరీక్షల లీకేజీలు, అవకతవకలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఎన్టీఏ, ఇలాంటి నిర్లక్ష్యపూరిత సాంకేతిక తప్పిదాలతో తన విశ్వసనీయతను మరింతగా దెబ్బతీస్తోందని విద్యా రంగ నిపుణులు మండిపడుతున్నారు.




