NEET UG 2026: దేశ చరిత్రలోనే ఫస్ట్ టైమ్.. క్వశ్చన్ పేపర్లకు వైమానిక దళం పహారా..!

NEET UG 2026: మే 3న జరిగిన నీట్-యూజీ 2026 పరీక్ష లీకేజీ నేపథ్యంలో జూన్ 21న జరగబోయే పునఃపరీక్షకు కేంద్రం మిలిటరీ స్థాయి భద్రతను పరిశీలిస్తోంది.

Naresh.k
Published on: 29 May 2026 9:16 AM IST
NEET UG 2026
X

NEET UG 2026: దేశ చరిత్రలోనే ఫస్ట్ టైమ్.. క్వశ్చన్ పేపర్లకు వైమానిక దళం పహారా..!

Indian Air Force: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక అనూహ్యమైన, అత్యంత కఠినమైన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ ప్రతిష్టాత్మక పరీక్షను మళ్లీ ఎలాంటి లీకులు లేకుండా, పక్కాగా నిర్వహించేందుకు దేశ రక్షణ దళాలను రంగంలోకి దించాలని భావిస్తోంది. జూన్ 21న జరగబోయే నీట్ పునఃపరీక్షను మిలిటరీ స్థాయి భద్రతతో నిర్వహించేందుకు తెరవెనుక చకచకా అడుగులు పడుతున్నాయి.

రక్షణ మంత్రిత్వ శాఖలోని ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో ఒక హై-లెవెల్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు భారత వైమానిక దళం ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. పరీక్షా పత్రాల ముద్రణ నుంచి మొదలుకొని కేంద్రాలకు చేరే వరకు ఎక్కడా లీకేజీకి చిన్న గ్యాప్ కూడా లేకుండా పటిష్టమైన లాజిస్టిక్స్, రవాణా వ్యవస్థను సిద్ధం చేయడం.

ప్రస్తుతం మన దేశంలో ప్రశ్నపత్రాలను పోస్టల్ శాఖ లేదా బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్‌ల ద్వారా రవాణా చేస్తారు. ఇందులో పలు నిర్వహణ కేంద్రాలు, అనేక మంది అధికారులు పాలుపంచుకోవడం వల్ల లీకేజీల ప్రమాదం ఎక్కువగా ఉంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి నేరుగా పరీక్షా కేంద్రాల నగరాలకు క్వశ్చన్ పేపర్లను భారత వైమానిక దళం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల ద్వారా అత్యంత సురక్షితంగా తరలిస్తారు. రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక, ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదంతో దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది. నిజానికి, 22 లక్షలకు పైగా అభ్యర్థుల కోసం మే 3న జాతీయ పరీక్షల ఏజెన్సీ ఈ నీట్ పరీక్షను నిర్వహించింది. అయితే, వ్యవస్థీకృత పద్ధతిలో ప్రశ్నపత్రం లీక్ అవ్వడం, బోర్డులోని కొందరు అంతర్గత వ్యక్తుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు రావడంతో.. లీకుల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని మే 12న ఈ పరీక్షను ఎన్‌టీఏ రద్దు చేసింది.

ప్రస్తుతం ఈ మెగా లీకేజీ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశాన్ని వణికించిన ఈ స్కామ్‌లో సీబీఐ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ముమ్మర దాడులు నిర్వహించింది. ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి 5 ప్రధాన రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు 11 మంది కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ఒక దేశపు అత్యున్నత పరీక్ష కోసం ఏకంగా డిఫెన్స్ విభాగాన్ని, వైమానిక దళాన్ని రంగంలోకి దించడం భారత చరిత్రలోనే అత్యంత అరుదైన విషయం. మరి జూన్ 21న జరగబోయే ఈ రక్షణ వలయ పరీక్ష ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story