NEET 2026 : నీట్ పేపర్ లీక్ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ.. జూన్ చివరిలో రీ-ఎగ్జామ్ ?

NEET 2026 : నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏడుగురిని అరెస్ట్ చేసిన అధికారులు, జూలైలో రీ-ఎగ్జామ్ నిర్వహించేందుకు ఎన్‌టీఏ సిద్ధమవుతోంది.

CR Reddy
Published on: 15 May 2026 8:13 AM IST
NEET 2026
X

NEET 2026

NEET 2026 : మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీబీఐ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసింది. తాజాగా మహారాష్ట్రకు చెందిన ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని కూడా అదుపులోకి తీసుకోవడంతో ఈ కుట్ర మూలాలు ఎంత లోతుగా ఉన్నాయనేది స్పష్టమవుతోంది. అరెస్టయిన ఐదుగురు ప్రధాన నిందితులను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల సీబీఐ కస్టడీకి పంపింది.

పేపర్ లీక్ వెనుక ఉన్న అసలు మాస్టర్‌మైండ్‌ను పట్టుకునేందుకు సీబీఐ టెక్నాలజీని వాడుతోంది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL)కి పంపారు. నిందితులు తమ వాట్సాప్ చాట్‌లను డిలీట్ చేసినప్పటికీ, వాటిని తిరిగి రిట్రీవ్ చేసేందుకు సైబర్ నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఈ చాటింగ్ జరిగిన సమయంలో నిందితులు ఎక్కడ ఉన్నారు? ఎవరెవరితో టచ్‌లో ఉన్నారు? అనే అంశాలపై ఫోకస్ పెట్టారు. సుమారు 50 మందికి పైగా వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని సీబీఐ అనుమానిస్తోంది. వారి బ్యాంక్ ఖాతాల వివరాలను కూడా సేకరిస్తున్నారు.

పేపర్ లీక్ వల్ల తీవ్ర ఆందోళనలో ఉన్న 23 లక్షల మంది విద్యార్థులకు ఊరటనిచ్చేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక అడుగులు వేస్తోంది. మళ్ళీ పేపర్ లీక్ కాకుండా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్‌ను సిద్ధం చేస్తోంది. జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో తిరిగి పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం కొత్త ప్రశ్నపత్రాలను రూపొందిస్తున్నారు. నిపుణులైన అధ్యాపకులతో కూడిన కొత్త టీమ్ ఈ ప్రశ్నలను సిద్ధం చేస్తోంది. పేపర్లను ప్రింటింగ్ ప్రెస్‌కు పంపేటప్పుడు కూడా ఎన్క్రిప్టెడ్ డిజిటల్ ఫార్మాట్ వాడాలని, తరలింపు సమయంలో జీపీఎస్ ట్రాకింగ్ ఉన్న వాహనాలను వినియోగించాలని నిర్ణయించారు.

రీ-ఎగ్జామ్ విషయంలో విద్యార్థులకు ఉన్న అతిపెద్ద సందేహం రిజిస్ట్రేషన్. అయితే, విద్యార్థులు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఎన్‌టీఏ వర్గాల సమాచారం. పాత హాల్ టికెట్లు లేదా కొత్తగా జారీ చేసే హాల్ టికెట్లతోనే పరీక్షకు హాజరుకావచ్చు. పేపర్ లీక్ కారణంగా నష్టపోయిన అర్హులైన విద్యార్థులకు న్యాయం జరిగేలా ఎన్‌టీఏ అడుగులు వేస్తోంది. ఎన్‌టీఏ కార్యాలయంలో కూడా సీబీఐ బృందం తనిఖీలు చేసి, పేపర్ తయారీ నుంచి పంపిణీ వరకు ఎక్కడ లోపం జరిగిందనే అంశంపై అధికారులను ప్రశ్నిస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story