NEET UG 2026 : నీట్ రీ-ఎగ్జామ్ రాసే విద్యార్థులకు అలర్ట్.. పరీక్షా కేంద్రాన్ని మార్చుకునే ఛాన్స్
NEET UG 2026 : నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ రాసే అభ్యర్థులు మే 21లోపు తమ పరీక్షా నగరాన్ని మార్చుకోవచ్చు.
NEET UG 2026
NEET UG 2026 : వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG) 2026 పరీక్షపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) భారీ అప్‌డేట్ ఇచ్చింది. పేపర్ లీక్ వివాదం కారణంగా మే 3న జరిగిన పరీక్షను రద్దు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష రాసే నగరాలను, అలాగే ప్రస్తుతం వారు ఉంటున్న అడ్రస్‌ను మార్చుకునేందుకు ఎన్‌టీఏ అద్భుతమైన అవకాశం కల్పించింది. దీనివల్ల విద్యార్థులు తమకు దగ్గర్లో ఉన్న సెంటర్‌ను ఎంచుకునే వీలుంటుంది.
మే 21 వరకు డెడ్‌లైన్.. ఎలా మార్చుకోవాలి?
అభ్యర్థులు తమ పరీక్షా నగరాన్ని మార్చుకోవడానికి మే 15 నుంచే విండో ఓపెన్ అయింది. దీనికి చివరి తేదీ మే 21వ తేదీ రాత్రి 11:50 గంటల వరకు మాత్రమే. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in లోకి వెళ్లి తమ లాగిన్ వివరాలతో ఈ మార్పులు చేసుకోవచ్చు. మీరు మొదటి, రెండో ప్రాధాన్యతగా ఏయే నగరాల్లో పరీక్ష రాయాలనుకుంటున్నారో ఎంచుకోవచ్చు. ఒకవేళ మీరు ఎలాంటి మార్పులు చేయకపోతే, పాత అప్లికేషన్‌లో ఉన్న సెంటర్‌నే ఎన్‌టీఏ కేటాయిస్తుంది. ఈ సదుపాయం కోసం అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
రీ-ఎగ్జామ్ షెడ్యూల్, అడ్మిట్ కార్డుల వివరాలు
నీట్ యూజీ రీ-ఎగ్జామ్ జూన్ 21న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు జరుగుతుంది. ఇది మునుపటిలాగే ఆఫ్ లైన్ (పెన్, పేపర్) మోడ్‌లో, మొత్తం 13 భాషల్లో నిర్వహించబడుతుంది. పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు, అడ్మిట్ కార్డులను జూన్ 14వ తేదీలోపు విడుదల చేస్తామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత దానిపై తప్పనిసరిగా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను అంటించాల్సి ఉంటుంది.
22 లక్షల మందికి మళ్ళీ పరీక్ష
మే 3న నిర్వహించిన నీట్ పరీక్షలో దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. అయితే మే 7న పేపర్ లీక్ వ్యవహారం బయటపడటంతో దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. సీబీఐ విచారణలో పేపర్ లీక్ మాస్టర్ మైండ్‌తో సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ పరీక్షను రద్దు చేసి, పారదర్శకంగా మళ్ళీ నిర్వహించాలని ఆదేశించారు. దీంతో ఇప్పుడు విద్యార్థులందరూ రెండోసారి పరీక్షకు సిద్ధమవుతున్నారు.




