NEET Exam 2026: నీట్ రీ-ఎగ్జామ్‌పై కేంద్ర మంత్రి కీలక ఆదేశాలు.. భద్రత విషయంలో ‘నో కాంప్రమైజ్’!

NEET Exam 2026: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ విచారణలో నాసిక్ నెట్‌వర్క్ గుట్టురట్టయింది. ఈ నేపథ్యంలో రీ-నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

Arun Chilukuri
Published on: 19 May 2026 5:58 PM IST
NEET Exam 2026
X

NEET Exam 2026: నీట్ రీ-ఎగ్జామ్‌పై కేంద్ర మంత్రి కీలక ఆదేశాలు.. భద్రత విషయంలో ‘నో కాంప్రమైజ్’!

NEET Exam 2026: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET-UG) ప్రశ్నపత్రం లీకేజీ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులు.. మహారాష్ట్రలోని నాసిక్ కేంద్రంగా సాగిన ఒక భారీ నెట్‌వర్క్‌ను బట్టబయలు చేశారు. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ ముఠా వరుస అరెస్టులతో కేసు కీలక మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో, వివాదాలకు తావులేకుండా 'రీ-నీట్' (పునఃపరీక్ష) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధప్రతిపాదికన ఏర్పాట్లు చేస్తోంది.

రాబోయే నీట్ (యూజీ) పునఃపరీక్ష సన్నాహాలను సమీక్షించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన మంగళవారం ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ భేటీలో పరీక్ష నిర్వహణలో సంపూర్ణ సమగ్రత, పారదర్శకతను కాపాడటంపై అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు.

గత పరీక్షా ప్రక్రియలో గుర్తించిన అన్ని రకాల సాంకేతిక, భద్రతా లోపాలను సమగ్రంగా సరిదిద్దాలని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా చిన్న అంతరం (Gap) కూడా ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. పునః-నీట్ పరీక్షను కట్టుదిట్టమైన భద్రతా ప్రోటోకాల్‌ల నడుమ, ఎలాంటి ఆటంకాలు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని ఉద్ఘాటించారు.

పరీక్షా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పటిష్టంగా పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహాయం తీసుకోనుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు (కలెక్టర్లు), పోలీసు సూపరింటెండెంట్లతో (SP) తక్షణమే సమన్వయ సమావేశాలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు నిరంతర సీసీ కెమెరాల (CCTV) నిఘా ఏర్పాటు చేయనున్నారు.

భద్రతతో పాటు పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సరైన రవాణా సౌకర్యాలు ఉండేలా చూడాలి. వేసవి తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, ఇతర నిత్యావసర వసతులను కల్పించాలి. భద్రత, కస్టమర్ కేర్ (సౌకర్యాల) విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని స్పష్టం చేశారు.

లీకేజీ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో పరీక్షల పట్ల పోయిన నమ్మకాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకే ప్రభుత్వం ఈ విధమైన అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పారదర్శకతే ఏకైక లక్ష్యంగా రీ-నీట్ పరీక్షను పూర్తి పవిత్రతతో నిర్వహిస్తామని కేంద్రం భరోసా ఇచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story