CJP: సీజేపీ ‘చలో పార్లమెంట్‌’ ఉద్రిక్తం.. హోంమంత్రి అమిత్‌ షాతో ధర్మేంద్ర ప్రధాన్ అత్యవసర భేటీ!

CJP: నీట్-యూజీ పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Arun Chilukuri
Published on: 20 July 2026 3:08 PM IST
CJP
X

 CJP: సీజేపీ ‘చలో పార్లమెంట్‌’ ఉద్రిక్తం.. హోంమంత్రి అమిత్‌ షాతో ధర్మేంద్ర ప్రధాన్ అత్యవసర భేటీ!

CJP: నీట్‌-యూజీ (NEET-UG) పేపర్ లీక్ వ్యవహారం దేశ రాజధానిలో తీవ్ర కలకలం రేపుతోంది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజునే ఈ వివాదం సెగలు రేపుతోంది. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పిలుపునిచ్చిన ‘చలో పార్లమెంట్’ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ భారీ మార్చ్‌కు పోలీసులు ముందస్తు అనుమతి నిరాకరించారు. విద్యార్థులను, నిరసనకారులను ఎక్కడికక్కడ అడ్డుకొనేందుకు ఢిల్లీ పోలీసులు పకడ్బందీగా బారికేడ్లను ఏర్పాటు చేసినప్పటికీ.. భారీ సంఖ్యలో తరలివచ్చిన ఆందోళనకారులు వాటిని దాటుకొని పార్లమెంట్‌ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. ప్రదర్శనకారులపై భాష్పవాయువు (Tear Gas) గోళాలను ప్రయోగించి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తోపులాట మరియు ఘర్షణల్లో పలువురు పోలీసులకు కూడా గాయాలైనట్లు సమాచారం అందుతోంది.

ఢిల్లీ వీధుల్లో నిరసనలు హోరెత్తుతున్న వేళ.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంట్ భవనం లోపలే వీరిద్దరి మధ్య అత్యవసర సమావేశం జరిగినట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. నీట్ వివాదం, తాజా ఉద్రిక్తతలు మరియు నిరసనల తీవ్రతను అణచడంపైనే వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ఒకవైపు ఆందోళనలు ఉధృతమవుతుండటంతో నష్టనివారణ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ‘చలో పార్లమెంట్‌’ నిరసనలకు నాయకత్వం వహిస్తోన్న ముఖ్య నేతలతో కేంద్రమంత్రి జేపీ నడ్డా ఇప్పటికే భేటీ కాగా.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఆందోళనకారులతో నేరుగా మాట్లాడుతున్నారు. మరోవైపు, అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను కూడా జేపీ నడ్డా త్వరలోనే పరామర్శించనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story