NEET-UG Scam : నీట్ రీఫండ్ పోర్టల్ హ్యాక్.. ఒక్కొక్కరి నుంచి రూ.1,700 చోరీ చేసిన 19 ఏళ్ల కుర్రాడు
NEET-UG Scam : నీట్ రీఫండ్ పోర్టల్‌ను హ్యాక్ చేసి 150 మందికి పైగా అభ్యర్థుల డబ్బును తన ఖాతాకు మళ్లించుకున్న 19 ఏళ్ల యువకుడిని అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
NEET-UG Scam
NEET-UG Scam : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ పరీక్షల వ్యవహారంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చుట్టూ వివాదాలు ముసురుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలతో తీవ్ర విమర్శలు, విచారణలు ఎదుర్కొంటున్న ఈ సంస్థకు తాజాగా మరో పెద్ద షాక్ తగిలింది. ఈసారి నీట్ పరీక్షకు సంబంధించిన ఫీజు రీఫండ్ ప్రక్రియలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఎన్‌టీఏ అధికారిక పోర్టల్‌లోకి అత్యంత తెలివిగా చొరబడి, వందలాది మంది అభ్యర్థుల రీఫండ్ సొమ్మును తన సొంత బ్యాంక్ ఖాతాకు మళ్లించుకున్న 19 ఏళ్ల యువకుడిని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పక్కా ప్లాన్‌తో అరెస్ట్ చేశారు.
బిహార్ కేటుగాడి గురి.. ఎన్‌టీఏ పోర్టల్
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బిహార్‌లోని గయా జిల్లాకు చెందిన నవీన్ యాదవ్ అనే 19 ఏళ్ల కుర్రాడు నీట్ రీఫండ్ పోర్టల్‌లో ఉన్న సాంకేతిక లోపాలను టార్గెట్ చేశాడు. గత నెలలో జరిగిన నీట్-యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో, రద్దయిన అభ్యర్థుల కోసం జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహించడానికి ఎన్‌టీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో పరీక్ష రాయకూడదనుకునే విద్యార్థులకు ఫీజు రీఫండ్ అందించేందుకు ప్రత్యేకంగా ఒక ఆన్‌లైన్ మాడ్యూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆన్‌లైన్ ప్రక్రియనే నిందితుడు నవీన్ తన స్వార్థ లాభం కోసం వాడుకున్నాడు.
350 మందిపై కన్నేసి 150 మందిని లూటీ చేశాడు
విద్యార్థులు తమ ఫీజు రీఫండ్ కోసం ఎన్‌టీఏ పోర్టల్‌లో నమోదు చేసిన బ్యాంకు ఖాతా వివరాలను మార్చేసి.. ఆ డబ్బు మొత్తం తన అకౌంట్ లోకి వచ్చేలా నవీన్ యాదవ్ ఒక కిలాడీ స్కెచ్ వేశాడు. దర్యాప్తులో భాగంగా అతడు సుమారు 350 మందికి పైగా అభ్యర్థుల ఆన్‌లైన్ ప్రొఫైల్స్, ఖాతాలను హ్యాక్ చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. వారిలో 150 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థుల అకౌంట్లలోకి విజయవంతంగా లాగిన్ అయి, వారి ఒరిజినల్ బ్యాంక్ అకౌంట్ నంబర్లను తీసేసి, తన సొంత బ్యాంక్ వివరాలను అప్‌డేట్ చేశాడు.
బ్రూట్ ఫోర్స్ అటాక్‌తో భారీ స్కామ్
ఈ సైబర్ దొంగతనానికి నిందితుడు బ్రూట్ ఫోర్స్ అటాక్ అనే ప్రమాదకరమైన సైబర్ దాడి పద్ధతిని ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విధానంలో అభ్యర్థుల ఐడీలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను సిస్టమ్ ద్వారా రకరకాల కాంబినేషన్లలో ఊహిస్తూ వరుసగా ప్రయత్నించి, చివరికి ఖాతాల్లోకి ప్రవేశం సంపాదించాడు. ఆ తర్వాత చాలా ఈజీగా ఒక్కో అభ్యర్థికి కేంద్ర ప్రభుత్వం నుండి తిరిగి రావాల్సిన రూ.1,700 రీఫండ్ మొత్తాన్ని తన ఖాతాలోకి క్రెడిట్ చేసుకున్నాడు. ఇలా లక్షలాది రూపాయలను విద్యార్థుల కళ్లుగప్పి నొక్కేశాడు.
బ్యాంక్ లావాదేవీల ఆధారంగా దొరికిపోయిన దొంగ
అయితే, ఎన్‌టీఏ పోర్టల్‌లో జరుగుతున్న రీఫండ్ లావాదేవీలలో ఒకే బ్యాంక్ అకౌంట్‌కు పదే పదే డబ్బులు బదిలీ అవుతుండటాన్ని గమనించిన ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. ఇందులో ఏదో తేడా ఉందని గ్రహించి వెంటనే అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బ్యాంక్ లావాదేవీలను నిశితంగా విశ్లేషించి, ఐపీ అడ్రస్ ఆధారంగా డబ్బు బదిలీలను ట్రాక్ చేశారు. చివరకు ఈ స్కామ్ సూత్రధారి బిహార్‌లో ఉన్న నవీన్ యాదవే అని తేల్చి, అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఎన్‌టీఏ భద్రతపై వెల్లువెత్తుతున్న అనుమానాలు
ఈ ఘోర పరాభవంపై అహ్మదాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) శరద్ సింఘల్ మాట్లాడుతూ.. ఎన్‌టీఏ వెబ్‌సైట్ సెక్యూరిటీ సిస్టమ్‌లో ఉన్న లోపాలను నిందితుడు తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు ప్రాథమిక విచారణలో రుజువైందని తెలిపారు. నిందితుడు నవీన్ గతంలో ఇంకేదైనా సైబర్ నేరాలకు పాల్పడ్డాడా లేదా అన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఏదేమైనా దేశంలోనే అత్యంత కీలకమైన పరీక్షలను నిర్వహించే ఎన్‌టీఏ పోర్టల్‌ను ఒక 19 ఏళ్ల కుర్రాడు ఇంత తేలికగా హ్యాక్ చేయడంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.




