Nepal floods: నేపాల్ వరదల్లో 320 మంది భారతీయులు గల్లంతు..విదేశాంగ శాఖ సంచలన ప్రకటన
Nepal floods: నేపాల్ ఆకస్మిక వరదల్లో 320 మంది భారతీయులు గల్లంతైనట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు.
Nepal floods: నేపాల్ వరదల్లో 320 మంది భారతీయులు గల్లంతు..విదేశాంగ శాఖ సంచలన ప్రకటన
Nepal floods: హిమాలయ దేశం నేపాల్‌ను అతలాకుతలం చేస్తున్న ప్రాణాంతక వరదలపై భారత విదేశాంగ శాఖ అత్యంత కీలకమైన ప్రకటన విడుదల చేసింది. నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక ప్రవాహాలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఏకంగా 320 మంది భారతీయులు గల్లంతయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. మరోవైపు చైనా సరిహద్దు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 400 మంది భారత పౌరులు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
గల్లంతైన పౌరుల ఆచూకీ కోసం నేపాల్ ప్రభుత్వంతో కలిసి సహాయక ఏజెన్సీలు అన్వేషణను మరింత ముమ్మరం చేశాయి. ప్రతి క్షణం పరిస్థితిని ఢిల్లీ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి గురువారం కాఠ్మాండూకు చేరుకున్న 21 మంది భారతీయులు శుక్రవారం సురక్షితంగా ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరంతా తమిళనాడు రాష్ట్రానికి చెందినవారిగా అధికారులు ధ్రువీకరించారు. నేపాల్‌లోని త్రిశూలి-1 జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయ కార్మికులను రెస్క్యూ బృందాలు సురక్షితంగా రక్షించాయి.
చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయులు రోడ్డు మార్గం ద్వారా నేపాల్‌లోకి ప్రవేశించారని, వారిని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చైనాలో చిక్కుకుపోయిన వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక చైనా అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటోంది. బీజింగ్ ఎంబసీ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా అనేక మంది బాధితుల కుటుంబ సభ్యులు అధికారులను సంప్రదిస్తున్నారు.
ప్రస్తుతానికి 320 మంది భారత పౌరులతో పాటు, మరో 100 మంది భారత సంతతికి చెందిన విదేశీయుల ఆచూకీ కూడా దొరకలేదని విదేశాంగ శాఖ పేర్కొంది. గల్లంతైన ప్రతి ఒక్కరినీ సురక్షితంగా కనిపెట్టడమే తమ ముందస్తు ప్రాధాన్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.




