Indian Currency: రూ.1,000 నోటు మళ్లీ వస్తుందా? ఆర్బీఐ క్లారిటీ ఇదే!

Indian Currency: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) త్వరలో కొత్తగా రూ.1,000 నోటును మళ్లీ విడుదల చేయనుందంటూ సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా విపరీతంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

G Krishna
Published on: 27 Oct 2026 5:28 PM IST
Indian Currency
X

Indian Currency: రూ.1,000 నోటు మళ్లీ వస్తుందా? ఆర్బీఐ క్లారిటీ ఇదే!

Indian Currency: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) త్వరలో కొత్తగా రూ.1,000 నోటును మళ్లీ విడుదల చేయనుందంటూ సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా విపరీతంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తప్పుడు ప్రచారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (PIB) ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది. సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తిగా ఫేక్ ప్రచారాలని తేల్చిచెప్పింది. కొత్త వెయ్యి రూపాయల నోటు ముద్రణపై గానీ, విడుదలపై గానీ ఆర్బీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది.

వైరల్ అవుతున్న ఫేక్ చిత్రాలు.. నెటిజన్లలో గందరగోళం

ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), టెలిగ్రామ్ వంటి వివిధ సామాజిక మాధ్యమాల్లో పసుపు రంగులో ముద్రించినట్లుగా ఉన్న కొత్త రూ.1,000 నోటు చిత్రాలు కొద్ది రోజులుగా తెగ వైరలవుతున్నాయి. కొత్త డిజైన్‌తో కూడిన ఈ నోటును ఇప్పటికే మార్కెట్లోకి తీసుకువచ్చారని, మరికొందరు త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుందంటూ తప్పుడు సమాచారాన్ని షేర్ చేశారు. ఈ పోస్టులు చూసిన సామాన్య ప్రజలు, నెటిజన్లు అసలు నిజంగానే కొత్త వెయ్యి రూపాయల నోటు వస్తోందా అంటూ పెద్ద ఎత్తున చర్చించుకోవడం ప్రారంభించారు. ఈ అయోమయ పరిస్థితిని గమనించిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగి అసలు నిజానిజాలను బయటపెట్టింది.

రూ.1,000 నోట్ల రద్దు చరిత్ర.. ప్రస్తుత చెలామణిలో ఉన్న నోట్లు ఇవే

దేశంలో నల్లధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అప్పటివరకు చలామణిలో ఉన్న పాత రూ.500, రూ.1,000 నోట్లన్నీ తమ లీగల్ టెండర్ హోదాను కోల్పోయాయి. ఆ తర్వాత ప్రభుత్వం కొత్త డిజైన్‌తో రూ.500 నోట్లను మాత్రమే మళ్లీ ప్రవేశపెట్టింది కానీ, రూ.1,000 నోటును మాత్రం తిరిగి చెలామణిలోకి తీసుకురాలేదు. అంతేకాకుండా, ఆ స్థానంలో తీసుకొచ్చిన అత్యున్నత విలువైన రూ.2,000 నోట్లను సైతం 2023 మే నెలలో ఆర్బీఐ వెనక్కి తీసుకునే ప్రక్రియను ప్రారంభించింది.

ప్రస్తుతం మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో భాగంగా దేశంలో రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 నోట్లు మాత్రమే అధికారికంగా చెలామణిలో ఉన్నాయి. కాబట్టి కొత్త రూ.1,000 నోటు వస్తోందంటూ వస్తున్న వదంతులను ప్రజలు ఎవరూ నమ్మవద్దని అధికారులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి నిర్ధారణ కాని ఫేక్ పోస్టులను చూసి మోసపోవద్దని, ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఏదైనా అధికారిక సమాచారం ఉంటే ఆర్బీఐ లేదా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే పరిశీలించాలని సూచించారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.