Nirmala Sitharaman: ఐడీబీఐ బ్యాంక్ వాటాల విక్రయంపై రాజకీయం రగడ.. రాహుల్ గాంధీ విమర్శలపై నిర్మలా సీతారామన్ బిగ్ కౌంటర్!

Nirmala Sitharaman: ఐడీబీఐ బ్యాంక్ వాటాల విక్రయంపై రాహుల్ గాంధీ విమర్శలు. కాంగ్రెస్ హయాంలోనే బ్యాంకులు నష్టపోయాయంటూ కౌంటర్ ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

Arun Chilukuri
Published on: 30 Oct 2026 3:57 PM IST
Nirmala Sitharaman
X

Nirmala Sitharaman: ఐడీబీఐ బ్యాంక్ వాటాల విక్రయంపై రాజకీయం రగడ.. రాహుల్ గాంధీ విమర్శలపై నిర్మలా సీతారామన్ బిగ్ కౌంటర్!

Nirmala Sitharaman: ప్రభుత్వ రంగంలోని ప్రముఖ ఐడీబీఐ బ్యాంక్‌లో మెజార్టీ వాటాను కెనడాకు చెందిన 'ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్' సంస్థకు విక్రయించే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. లాభాల బాటలో పయనిస్తున్న బ్యాంకును విదేశీ సంస్థకు కట్టబెట్టడాన్ని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు.

కాంగ్రెస్ హయాంలో దేశాభివృద్ధి కోసం బ్యాంకులు ఏర్పాటైతే.. ప్రస్తుత మోదీ హయాంలో అవి కార్పొరేట్ శక్తులకు అమ్ముడవుతున్నాయని ఆయన విమర్శించారు. అంతేకాకుండా, వాటాల విక్రయానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న బ్యాంక్ ఉద్యోగులు, అధికారులకు రాహుల్ గాంధీ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ రాహుల్ గాంధీ ఆరోపణలను తిప్పికొట్టారు.

కాంగ్రెస్ హయాంలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా, రాజకీయంగా పలుకుబడి ఉన్న బడా వ్యాపారవేత్తలకు విచ్చలవిడిగా అప్పులు ఇచ్చేలా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని ఆమె మండిపడ్డారు. ఆ నాటి తప్పుడు విధానాల వల్లే మొండి బకాయిలు పెరిగిపోయి ఐడీబీఐ బ్యాంక్ తీవ్ర నష్టాలపాలైందని, ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఆ బ్యాంక్ అత్యంత దయనీయ స్థితిలో ఉండేదని ఆమె గుర్తుచేశారు. అలాంటి దుస్థితిలో ఉన్న బ్యాంకును మోదీ ప్రభుత్వం తన ముందుచూపు విధానాలతో మళ్లీ గాడిన పడేసిందని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం మరియు ఎల్‌ఐసీ (LIC) తరఫున సుమారు రూ.25 వేల కోట్లకు పైగా మూలధనాన్ని సమీకరించి ఐడీబీఐ బ్యాంకును పూర్వస్థితికి తీసుకువచ్చామని, ఫలితంగానే ఇప్పుడు బ్యాంక్ లాభాల బాటలో వృద్ధి పథంలో అడుగులు వేస్తోందని నిర్మలా సీతారామన్ వివరించారు. బ్యాంక్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో అన్ని నియమ నిబంధనలను పక్కాగా పాటించామని, ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశామని తెలిపారు.

కాంగ్రెస్ పాలనలో బ్యాంకింగ్ వ్యవస్థలో బడా బాబులకు, సామాన్య పౌరులకు వేర్వేరు నిబంధనలు ఉండేవని, కానీ ఆ చీకటి శకం ముగిసిపోయిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం సామాన్య ప్రజలకు రుణాలు అత్యంత సులభంగా అందుబాటులో ఉంటున్నాయని, గతంలో మాదిరిగా ఫోన్ కాల్స్‌తో రుణాలు ఇవ్వాలని ఏ బ్యాంకు ఉద్యోగిపై కూడా ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని ఆమె స్పష్టం చేశారు.

కాగా, ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం మరియు ఎల్‌ఐసీకి సంయుక్తంగా ఉన్న 60.72 శాతం మెజారిటీ వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ సంస్థకు రూ.52,878 కోట్లకు విక్రయించేందుకు కేంద్ర మంత్రివర్గం అక్టోబర్ 14న అధికారికంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిర్ణయాన్ని 'యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఐడీబీఐ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయిస్' తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ అమ్మకం ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, పార్లమెంటరీ పర్యవేక్షణలో సమగ్ర సమీక్ష జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.