Nirmala Sitharaman: భారత ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదు.. నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు

Nirmala Sitharaman:

Arun Chilukuri
Published on: 25 May 2026 2:49 PM IST
Nirmala Sitharaman: భారత ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదు.. నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు
X

Nirmala Sitharaman: పశ్చిమాసియా (Middle East) రూపంలో అంతర్జాతీయంగా ఎదురవుతున్న భౌగోళిక రాజకీయ సవాళ్ల నేపథ్యంలో భారతదేశ చమురు, ఎరువులు, విదేశీ మారక నిల్వలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ముంబయిలో ఘనంగా జరిగిన సిడ్బీ (SIDBI) వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు, కొందరు నిరాశావాదులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆమె తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు.

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధనం (Fuel), ఎరువులు (Fertilizer), బంగారం ధరలు రికార్డు స్థాయిలో భారీగా పెరిగాయని నిర్మలా సీతారామన్‌ గుర్తుచేశారు. గ్లోబల్ మార్కెట్‌లో ఈ మూడింటికీ డాలర్ల రూపంలోనే భారీగా చెల్లింపులు జరగాల్సి ఉంటుందని, దీనివల్ల దేశీయంగా విదేశీ మారక నిల్వలు (Forex) కరిగిపోకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందన్నారు.

దేశీయంగా ఆర్థిక వృద్ధికి, సామాన్యుడి బడ్జెట్‌కు ఆటంకం కలగకూడదన్న పక్కా వ్యూహంతోనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిందని ఆర్థిక మంత్రి వివరించారు. ఈ పన్నుల తగ్గింపు నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.1 లక్ష కోట్ల మేర అదనపు ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని, అయినా ప్రజల సంక్షేమం కోసమే ఈ భారాన్ని మోస్తున్నామని చెప్పారు.

ఆ మూడు ‘F’ల పైనే ప్రధాని మోదీ ఫోకస్:

ప్రస్తుత అంతర్జాతీయ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా ‘3 F’లపై (ఫ్యూయల్‌, ఫెర్టిలైజర్‌, ఫారెక్స్ - Fuel, Fertilizer, Forex) దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ పౌరులను, యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

దేశ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ ముందస్తు పొదుపు చర్యలను ప్రకటిస్తే.. దీన్ని కొందరు అవకాశంగా మార్చుకుని భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోందన్న రేంజ్‌లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి నిరాశావాద ధోరణి ఏమాత్రం సరికాదని హితవు పలికారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న మంచిని విస్మరించి.. లేనిపోని అపోహలను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితులకు దేశీయ విధానాలు కారణం కాదని, అంతర్జాతీయ బాహ్య కారకాలే (External Factors) ప్రధాన కారణమన్న కనీస సత్యాన్ని విస్మరించకూడదని చెప్పారు.

ప్రజలకు ధైర్యం, భరోసా ఇవ్వాల్సింది పోయి.. సమాజంలో అనవసర భయాందోళనలు సృష్టించడం బాధ్యతారాహిత్యమని ఆర్థిక మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాహ్య సవాళ్లు ఎన్ని ఉన్నప్పటికీ అంతర్గతంగా భారత్ ఎంతో బలంగా ఉందని, మన ఆర్థిక వ్యవస్థ సురక్షితంగా ఉందంటూ నిర్మలా సీతారామన్‌ దేశ ప్రజలకు, పారిశ్రామిక వర్గాలకు మరోసారి గట్టి భరోసా ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story