Conductor: చిల్లర లేదు.. బస్సు దిగిపో! సాక్షాత్తూ మంత్రికే షాకిచ్చిన కండక్టర్
Conductor: కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్‌కు ఊహించని అనుభవం ఎదురైంది.
Conductor: చిల్లర లేదు.. బస్సు దిగిపో! సాక్షాత్తూ మంత్రికే షాకిచ్చిన కండక్టర్
Byrathi Suresh: ప్రజా రవాణా వ్యవస్థ క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామని బస్సెక్కిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రికి ఒక కండక్టర్ ఊహించని భారీ షాక్ ఇచ్చాడు. నా దగ్గర చిల్లర లేదు.. చిల్లర లేకుంటే బస్సు దిగిపోండి అంటూ సాక్షాత్తూ మంత్రిగారికే హుకుం జారీ చేశాడు. కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ బెంగళూరు నగరంలో ఆర్టీసీ బస్సు సేవలపై నిర్వహించిన ఈ ఆకస్మిక తనిఖీ ప్రస్తుతం సోషల్ మీడియాలో, రవాణా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
ప్రజలకు క్షేత్రస్థాయిలో అందుతున్న రవాణా సేవలను స్వయంగా పరిశీలించేందుకు మంత్రి బైరతి సురేష్ ఒక ప్లాన్ వేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ముఖానికి మాస్క్ ధరించి, ఒక సాధారణ ప్రయాణికుడిలా నగరంలోని బస్సు ఎక్కారు. కట్ చేస్తే.. అక్కడ ఆయనకు ఆర్టీసీ సిబ్బంది అసలు సిసలైన విశ్వరూపం చూపించారు.
బస్సు ఎక్కిన మంత్రి ఒక సాధారణ ప్రయాణికుడిలా కండక్టర్‌కు రూ. 100 నోటు ఇచ్చి రెండు టికెట్లు ఇవ్వమని అడిగారు. అయితే ఆ కండక్టర్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ, తన వద్ద సరిపడా చిల్లర లేదంటూ ఖాళీ బ్యాగును మంత్రి మొహం ముందే చూపించాడు. అంతటితో ఆగకుండా.. చిల్లర లేకపోతే బస్సు దిగిపోవాలి అంటూ కరాఖండిగా తేల్చి చెప్పాడు. మాస్క్ వెనుక ఉన్నది సాక్షాత్తూ రవాణా శాఖ మంత్రి అని తెలియకపోవడంతో కండక్టర్ తన ప్రతాపం చూపించాడు.
మంత్రికి అదే ప్రయాణంలో మరో చేదు అనుభవం కూడా ఎదురైంది. ఒక బస్ స్టాప్ వద్ద ప్రయాణికుడు చేయి చూపి బస్సు ఆపమని కోరినప్పటికీ, డ్రైవర్ బస్సును ఆపకుండా అత్యంత నిర్లక్ష్యంగా ముందుకు పోనివ్వడాన్ని కూడా మంత్రి లైవ్‌లో గమనించారు. సాధారణ ప్రజల పట్ల, రోజువారీ ప్రయాణికుల పట్ల ఆర్టీసీ సిబ్బంది విధుల్లో చూపిస్తున్న ఈ తీవ్ర నిర్లక్ష్యంపై రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా తన నిజరూపాన్ని బయటపెట్టడంతో ఒక్కసారిగా అక్కడున్న సిబ్బంది గుండె గుభేల్ మంది.
సాక్షాత్తూ తనతోనే అంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన సదరు కండక్టర్‌ను, అలాగే స్టాప్‌లో బస్సు ఆపకుండా వెళ్లిన డ్రైవర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన రవాణా శాఖ ఉన్నతాధికారులను స్పాట్ లోనే ఆదేశించారు. ఈ ఆకస్మిక తనిఖీ ద్వారా మంత్రి బైరతి సురేష్ ఆర్టీసీ సిబ్బందికి చాలా గట్టి హెచ్చరిక పంపారు. సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ విధుల్లో అశ్రద్ధ వహిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిరోజూ చిల్లర సమస్యతో, డ్రైవర్ల నిర్లక్ష్యంతో నరకం చూసే సగటు ప్రయాణికుడి కష్టాలు మంత్రి పుణ్యమా అని ఇలా వెలుగులోకి రావడం, తక్షణమే యాక్షన్ తీసుకోవడంపై సాధారణ జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




