Noida Bus Fire: నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సులో భారీ మంటలు.. 30 మంది సేఫ్..

Noida Bus Fire: ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ పరిధిలోని నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై అక్టోబర్ 6వ తేదీన ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

G Krishna
Published on: 6 Oct 2026 7:07 PM IST
Noida Bus Fire
X

Noida Bus Fire: నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సులో భారీ మంటలు.. 30 మంది సేఫ్..

Noida Bus Fire: ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ పరిధిలోని నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై అక్టోబర్ 6వ తేదీన ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్ 148 సమీపంలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మంటలు క్షణాల్లో బస్సు మొత్తానికి వ్యాపించడంతో, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ, మంటల జ్వాలలు అలుముకున్నాయి. ప్రమాద తీవ్రత కారణంగా చాలా దూరం నుంచే ఈ పొగ కనిపించడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

30 మంది ప్రయాణికులు క్షేమం

ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ బస్సు ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఉన్నట్లుండి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయంతో కేకలు వేశారు. అయితే, అదృష్టవశాత్తూ ప్రయాణికులందరూ సకాలంలో బస్సు నుంచి కిందకు దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రాథమికంగా ధృవీకరించారు.

కాలి బూడిదైన సామాగ్రి

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ప్రమాదం జరిగే ముందు బస్సులో పెద్ద పేలుడు లాంటి శబ్దం వినిపించింది. ఆ వెంటనే మంటలు చాలా వేగంగా విస్తరించి బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. ప్రాణాలు దక్కించుకునే క్రమంలో ప్రయాణికులు త్వరితగతిన బయటకు పరుగులు తీశారు. దీంతో వారి వస్తువులు, సామాన్లు బస్సులోనే ఉండిపోయి మంటల్లో పూర్తిగా కాలి బూడిదయ్యాను.

రహదారిపై ట్రాఫిక్ నిలిపివేత

సమాచారం అందుకున్న వెంటనే నాలెడ్జ్ పార్క్ పోలీస్ స్టేషన్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో బస్సు పూర్తిగా అస్థిపంజరంలా మారింది. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని, అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.