NEET Leak: ఎన్‌టీఏలో భారీ ప్రక్షాళన.. 47 మంది అధికారులను తొలగించిన కేంద్రం

నీట్‌ పేపర్‌ లీకేజీ తర్వాత ఎన్‌టీఏలో కేంద్రం భారీ ప్రక్షాళన చేపట్టింది. 47 మంది అధికారులను తొలగించి సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 July 2026 10:22 PM IST
NEET Leak
X

NEET Leak

దేశవ్యాప్తంగా నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. జేఈఈ, నీట్‌ సహా పలు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్న ఎన్‌టీఏలో అక్రమాలకు బాధ్యులుగా గుర్తించిన 47 మంది అధికారులను సేవల నుంచి తొలగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలతో ఎన్‌టీఏ పదే పదే వివాదాల్లో నిలవడంతో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలగించిన అధికారుల్లో పలువురిపై న్యాయపరమైన, క్రిమినల్‌ చర్యలు కూడా కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఎన్‌టీఏలో పారదర్శకతను పెంచడం, పరీక్షల నిర్వహణలో లోపాలను సరిదిద్దడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇది సంస్థలో చేపడుతున్న ప్రక్షాళనలో తొలి దశ మాత్రమేనని పేర్కొన్నారు.

అదే సమయంలో భవిష్యత్‌లో ప్రశ్నపత్రాల లీకేజీలకు అవకాశం లేకుండా నిపుణుల కమిటీ సూచనల మేరకు ఔట్‌సోర్సింగ్‌ విధానంలో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. పరీక్షల నిర్వహణను మరింత భద్రంగా, పారదర్శకంగా మార్చేందుకు పలు సంస్కరణలు అమలు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story