Road Accident: విషాదంగా మారిన వివాహ వేడుక.. ఊపిరాడక ఐదుగురి దుర్మరణం!

Road Accident: ఒడిశా రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

Arun Chilukuri
Published on: 23 July 2026 2:15 PM IST
Road Accident
X

Road Accident: విషాదంగా మారిన వివాహ వేడుక.. ఊపిరాడక ఐదుగురి దుర్మరణం!

Road Accident: ఒడిశా రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఒకే రోజు జరిగిన ఈ రెండు దుర్ఘటనల్లో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వివాహ వేడుకకు వెళ్లి వస్తూ కొందరు, అనారోగ్యంతో ఉన్న బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్తూ మరికొందరు మృత్యువాత పడటం స్థానికంగా తీవ్ర కలచివేసింది.

దేంకానాల్‌ జిల్లా సదర్‌ ఠాణా పరిధిలోని మహిషాపుటా వద్ద గురువారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి ఓ వివాహానికి హాజరైన ఏడుగురు వ్యక్తులు కారులో తమ స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. మహిషాపుటా వద్దకు రాగానే కారు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఇది గమనించిన గ్రామస్థులు వెంటనే స్పందించి, ట్రాక్టర్‌ సాయంతో కారును బయటకు తీశారు.

కానీ, అప్పటికే కారులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మృతులను బంగురిసింగి గ్రామానికి చెందిన చంద్రకాంత్‌ స్వయిన్‌, అవినాష్‌ సాహు, అభిషేక్‌ సాహు, రాకేశ్‌ సాహు, రామ్‌ సాహులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం దేంకానాల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు కేంఝర్‌ జిల్లాలో బుధవారం రాత్రి మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో అస్వస్థతకు గురైన తమ కుమారుడిని కుటుంబసభ్యులు కారులో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story