Omar Abdullah: ఆర్టికల్ 370 రద్దు చేయకుంటే పీవోకే మనదే అయ్యేది.. సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు..

Omar Abdullah: 2019లో ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయకపోతే పీవోకే ప్రజలు భారత్‌లో కలిసేవారన్న జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. ఒమర్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ నేత సునీల్ శర్మ.

Arun Chilukuri
Published on: 15 Aug 2026 4:15 PM IST
Omar Abdullah
X

Omar Abdullah: ఆర్టికల్ 370 రద్దు చేయకుంటే పీవోకే మనదే అయ్యేది.. సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు..

Omar Abdullah: జమ్మూకశ్మీర్‌కు ఆర్టికల్ 370 కింద ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయకుండా, రాష్ట్ర హోదాను అలాగే కొనసాగించి ఉంటే.. ఈపాటికే పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రజలు భారత్‌లో విలీనం కావాలని కోరుకునేవారని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పీవోకేలో హక్కుల కోసం పోరాడుతున్న ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర అణచివేతపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

"పీవోకేలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతూ డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, ఎందరో జైళ్లలో మగ్గడం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. 1947లో పాకిస్థానీ దురాక్రమణ దాడులను ఎదుర్కొని భారత్‌లో కలవాలని మన పూర్వీకులు తీసుకున్న నిర్ణయం ఎంత సరైనదో పీవోకేలోని నేటి పరిస్థితులు నిరూపిస్తున్నాయి." అని ఒమర్ అబ్దుల్లా అన్నారు.

భారత సైన్యం రంగంలోకి దిగకముందే 1947లో పాక్ దురాక్రమణదారులకు ఎదురొడ్డి పోరాడిన తన తాత షేక్ మహమ్మద్ అబ్దుల్లాను ఒమర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. నాటి చారిత్రక నినాదం "హమ్లావర్ ఖబర్దార్, హమ్ కశ్మీరీ హై తయ్యార్" (దాడి చేసేవారూ జాగ్రత్త, మేం కశ్మీరీలం సిద్ధంగా ఉన్నాం) ను గుర్తుచేశారు.

ఒకవేళ 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా రద్దు నిర్ణయం తీసుకోకపోయి ఉంటే, పీవోకే ప్రజలు జమ్మూకశ్మీర్‌లో తిరిగి చేరడానికి ఉద్యమించేవారని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు ఒమర్ తెలిపారు. వారి కోసం జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో కొన్ని స్థానాలను ఖాళీగా ఉంచామని, ఏదో ఒకరోజు ఆ స్థానాలు భర్తీ అవుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సునీల్ శర్మ ఈ వ్యాఖ్యలను బాధ్యతారహితమైనవిగా అభివర్ణించారు.

స్వాతంత్య్ర దినోత్సవం వంటి జాతీయ పర్వదినాన ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడాల్సింది పోయి, ఒమర్ సంకుచిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. కాగా, రద్దు చేసిన రాష్ట్ర హోదాతో పాటు ఇతర రాజ్యాంగ హామీల పునరుద్ధరణ కోసం తమ ప్రభుత్వం పోరాడుతూనే, అభివృద్ధిని ఏమాత్రం విస్మరించకుండా ముందుకు సాగుతుందని ఒమర్ స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story