On Camera: ముంబై లోకల్ రైలులో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. కిందపడ్డ వ్యక్తి!
On Camera: ముంబై లోకల్ రైలులో తలుపు వద్ద నిలబడే విషయంలో ఇద్దరు ప్రయాణికులు గొడవపడ్డారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి రైలు నుంచి పట్టాలపై పడిపోయాడు.
On Camera: ముంబై లోకల్ రైలులో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. కిందపడ్డ వ్యక్తి!
On Camera: ముంబై లోకల్ రైలులో ప్రయాణికుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర కలకలం రేపింది. రైలు ద్వారం దగ్గర నిలబడే విషయంలో మొదలైన చిన్నపాటి వాగ్వాదం చివరకు కొట్లాటకు దారితీసింది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు కదులుతున్న రైలు నుంచి పట్టాలపై పడిపోయాడు. అయితే రైలు నెమ్మదిగా వెళ్తుండటంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో చర్చ్‌గేట్ నుంచి విరార్ వెళ్తున్న ఫాస్ట్ లోకల్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు తలుపు వద్ద నిలబడే విషయంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య మొదట వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటికే అది తీవ్ర ఘర్షణగా మారింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీడియోలో ఇద్దరు ప్రయాణికులు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకోవడం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి దెబ్బల నుంచి తప్పించుకునేందుకు వెనక్కి జరగడంతో రైలు నుంచి కిందపడిపోయాడు.
అతడు ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టాలపై పడిపోయినట్లు సమాచారం. అయితే రైలు వేగం తక్కువగా ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. సాధారణంగా రద్దీగా ఉండే ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణికుల మధ్య చోటుచేసుకుంటున్న ఇటువంటి ఘర్షణలు మరోసారి భద్రతాపరమైన ఆందోళనలకు కారణమవుతున్నాయి.




