Operation Firewall: నేవీ రహస్యాల లీక్.. ‘ఆపరేషన్ ఫైర్ వాల్’లో ఇద్దరి అరెస్ట్!
Operation Firewall: భారత నావికాదళ రహస్యాలను పాకిస్థాన్ గూఢచారి సంస్థలకు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర నిఘా నెట్‌వర్క్‌ను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు
Operation Firewall: నేవీ రహస్యాల లీక్.. ‘ఆపరేషన్ ఫైర్ వాల్’లో ఇద్దరి అరెస్ట్!
Operation Firewall: భారత నావికాదళ రహస్యాలను పాకిస్థాన్ గూఢచారి సంస్థలకు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర నిఘా నెట్‌వర్క్‌ను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు విజయవంతంగా ఛేదించాయి. 'ఆపరేషన్ ఫైర్ వాల్' పేరిట దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ భారీ నిఘా ఆపరేషన్‌లో కీలక పురోగతి లభించింది.
పాకిస్థాన్‌కు అత్యంత సున్నితమైన సముద్ర రక్షణ సమాచారాన్ని చేరవేస్తున్నారనే పక్కా ఆధారాలతో ఇద్దరు ప్రధాన నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో విశాఖపట్నం నేవల్ బేస్‌కు చెందిన ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీతో పాటు, నావికాదళంలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న అన్నం సాయి వరప్రసాద్ ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
డబ్బు ఆశతో దేశద్రోహం.. వాట్సాప్ ఓటీపీల ద్వారా సమాచారం లీక్
ఈ చొరబాటు మూలాలను పసిగట్టిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన 12 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా ఏకకాలంలో దాడులకు దిగాయి. ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, గోవా, ఢిల్లీ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, బిహార్ వంటి 10 కీలక రాష్ట్రాల్లో అత్యంత రహస్యంగా తనిఖీలు చేపట్టాయి.
తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ప్రదీప్ ముఖర్జీని అదుపులోకి తీసుకోగా, సాయి వరప్రసాద్‌ను ఏపీలోనే అరెస్ట్ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో నిందితులు కేవలం డబ్బు ఆశతోనే పాకిస్థాన్ హ్యాండ్లర్లకు కీలక సమాచారాన్ని చేరవేసినట్లు తేలింది. ముఖ్యంగా భారతీయ మొబైల్ నంబర్లపై వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేయడానికి అవసరమైన ఓటీపీ (OTP)లను పాక్ ఏజెంట్లకు షేర్ చేసి, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ద్వారా నావికాదళ రహస్యాలు, నేవల్ బేస్ వివరాలను లీక్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
18 మంది విచారణ.. విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టిన అధికారులు
అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లతో సహా పలు కీలక ఎలక్ట్రానిక్ పరికరాలను కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. కోయంబత్తూర్‌లో పట్టుబడిన ప్రదీప్ ముఖర్జీని అధికారులు విజయవాడ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆయనకు ఈ నెల 14వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
ఈ ఆపరేషన్‌లో భాగంగా కేవలం వీరిద్దరే కాకుండా మరో 13 మంది నేవీ సిబ్బందితో సహా మొత్తం 18 మంది అనుమానితులను ఇంటెలిజెన్స్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరికి ప్రమేయం ఉందనే కోణంలో లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.




