Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' అమరవీరుల పేర్లు అధికారికం.. జాతీయ యుద్ధ స్మారకంలో మన మురళీ నాయక్!

Operation Sindoor: పాకిస్థాన్‌పై భారత్ జరిపిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో వీరమరణం పొందిన ఆరుగురు అమరవీరుల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

Arun Chilukuri
Published on: 26 Jun 2026 11:51 AM IST
Operation Sindoor
X

Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' అమరవీరుల పేర్లు అధికారికం.. జాతీయ యుద్ధ స్మారకంలో మన మురళీ నాయక్!

Operation Sindoor: దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో శత్రువులతో పోరాడి ప్రాణాలర్పించిన వీరజవాన్లకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత గౌరవం కల్పించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్‌పై భారత సైన్యం జరిపిన అత్యంత రహస్య, వ్యూహాత్మక ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’లో వీరమరణం పొందిన ఆరుగురు భారత జవాన్ల పేర్లను కేంద్రం ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది. వీరి పేర్లను ఢిల్లీలోని 'నేషనల్‌ వార్ మెమోరియల్‌ (National War Memorial)' అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. త్వరలోనే ఇండియా గేట్ సర్కిల్‌లో ఉన్న జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రత్యేక శిలాఫలకంపై వీరి పేర్లను శాశ్వతంగా చెక్కనున్నారు.

దేశం కోసం ఐదుగురు అధికారులు, ఒక అగ్నివీర్ వీరమరణం

పాకిస్థాన్ ఉగ్ర శిబిరాలపై జరిగిన ఈ చారిత్రాత్మక ఆపరేషన్‌లో ఐదుగురు ఆర్మీ అధికారులతో పాటు ఒక అగ్నివీర్ దేశం కోసం పోరాడుతూ అమరులయ్యారు. వారి వివరాలు ఇక్కడ చూడవచ్చు:

సుబేదార్‌ మేజర్‌ పవన్‌ కుమార్‌ - 10 ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌ హెడ్‌క్వార్టర్స్‌

రైఫిల్‌మ్యాన్‌ సునీల్‌ కుమార్‌ - జమ్మూకశ్మీర్‌ లైట్‌ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్ (4వ బెటాలియన్)

లాన్స్‌ నాయక్‌ దినేశ్‌ కుమార్‌ - 5 ఫీల్డ్‌ రెజిమెంట్‌

హవల్దార్‌ సునీల్‌ కుమార్‌ సింగ్‌ - 237 ఫీల్డ్‌ వర్క్‌షాప్‌

సార్జెంట్‌ సురేంద్ర కుమార్‌ - ఎయిర్‌ఫోర్స్‌ 39వ వింగ్‌

అగ్నివీర్‌ మురళీ నాయక్‌ - 851 లైట్‌ రెజిమెంట్‌

వీరిలో అత్యంత సాహసోపేతంగా పోరాడిన రైఫిల్‌మ్యాన్‌ సునీల్ కుమార్‌కు మరణానంతరం దేశంలోనే మూడో అత్యున్నత యుద్ధ పురస్కారమైన ‘వీర చక్ర’ను కేంద్రం ప్రకటించింది. అలాగే ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సార్జెంట్‌ సురేంద్ర కుమార్‌ను ‘వాయు మెడల్‌’తో గౌరవించింది.

అమరుడైన తెలుగు బిడ్డ 'మురళీ నాయక్'

ఈ ఆపరేషన్‌లో వీరమరణం పొందిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అగ్నివీర్ మురళీ నాయక్ ఉండటం తెలుగువారందరినీ గర్వపడేలా చేస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా కళ్లితండాకు చెందిన మురళీ నాయక్.. 2022లో అగ్నివీర్‌గా ఎంపికయ్యారు. తొలుత పంజాబ్‌, అస్సాం రాష్ట్రాల్లో సేవలు అందించిన ఆయన, ఆపరేషన్ సిందూర్ సమయంలో జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహించారు. పాక్ సైన్యంతో జరిగిన హోరాహోరీ ఎదురుకాల్పుల్లో ఆయన వీరమరణం పొందారు.

అసలేంటి ఈ ఆపరేషన్ సిందూర్..?

2025 ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన భీకర దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్న భారత సైన్యం.. సరిగ్గా మే 7వ తేదీన పాకిస్థాన్‌ సరిహద్దుల్లోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లపై మెరుపు దాడి చేసింది. 'ఆపరేషన్ సిందూర్' పేరిట చేపట్టిన ఈ కౌంటర్ అటాక్‌లో పాక్ ఉగ్ర శిబిరాలు పూర్తిగా ధ్వంసమవగా, భారత్ తన ఆరుగురు వీరపుత్రులను కోల్పోయింది. నేడు దేశం వారి త్యాగాన్ని స్మరించుకుంటూ సముచిత గౌరవాన్ని అందిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story