Girl Menstruation: విద్యార్థినికి పీరియడ్స్.. ఉపాధ్యాయుడు ఘోరంగా
Girl Menstruation: చెన్నైలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో పీరియడ్స్ అయిన విద్యార్థిని పట్ల ఒక ఉపాధ్యాయుడు అత్యంత క్రూరంగా అవమానించిన ఘటన సంచలనం రేపుతోంది.
Girl Menstruation: విద్యార్థినికి పీరియడ్స్.. ఉపాధ్యాయుడు ఘోరంగా
Chennai government school : విద్యాబుద్ధులు నేర్పి, పిల్లలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఒక ఉపాధ్యాయుడే విచక్షణ మరచి ప్రవర్తించాడు. ఆడపిల్లల శరీరంలో వచ్చే సహజమైన మార్పుల పట్ల కనీస అవగాహన, మానవత్వం లేకుండా ప్రవర్తించి ఓ చిన్నారిని అందరి ముందూ అవమానించాడు. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ అమానుష ఘటన ఇప్పుడు స్థానికంగానే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర సంచలనం రేపుతోంది.
పోలీసులు , బాధితుల కథనం ప్రకారం.. మధ్యాహ్న భోజన విరామం ముగిసిన తర్వాత విద్యార్థులంతా క్లాస్ రూమ్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో సదరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు క్లాస్‌లోకి వచ్చాడు. పీరియడ్స్ అయిన ఒక విద్యార్థినిని ఉద్దేశించి.. ఆమె నుంచి ఏదో వాసన వస్తోందంటూ అందరి ముందు గద్దించాడు. అంతటితో ఆగకుండా, తోటి విద్యార్థులందరి ముందూ ఆమెను తీవ్రంగా అవమానిస్తూ తరగతి గదిలో నుండి బయటకు పంపించి వేశాడు.
ఆ ఉపాధ్యాయుడి నిర్వాకంతో తీవ్ర మనస్తాపానికి, అవమానానికి గురైన ఆ చిన్నారికి ఏం చేయాలో పాలుపోలేదు. పాఠశాల ముగిసేవరకు, గంటల తరబడి తరగతి గది వెలుపలే నిలబడి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. స్కూల్ బెల్ కొట్టిన తర్వాత ఏడుస్తూనే ఇంటికి వెళ్లిన ఆ బాలిక, పాఠశాలలో జరిగిన ఘోరం గురించి తన తల్లిదండ్రులకు చెప్తూ వెక్కివెక్కి ఏడ్చింది.
సహజమైన శారీరక ప్రక్రియను అర్థం చేసుకోకుండా, తన కుమార్తెను అంతలా అవమానించిన విషయం తెలుసుకుని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బంధువులు, స్థానికులతో కలిసి పాఠశాల వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. బాధ్యత లేని ఆ ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో సదరు ఉపాధ్యాయుడిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై సామాజిక కార్యకర్తలు, నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఇలాంటి వారేనా పిల్లలకు సంస్కారం నేర్పేది?, నెలసరిపై సమాజంలో అవగాహన కల్పించాల్సిన గురువే ఇలా అజ్ఞానంతో ప్రవర్తించడం సిగ్గుచేటు అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారం కాస్తా తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. దీనిపై తమిళనాడు మంత్రి రాజ్‌మోహన్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని స్పష్టం చేశారు. విద్యాశాఖ అధికారుల నుంచి వచ్చే నివేదిక ఆధారంగా సదరు ఉపాధ్యాయుడిపై కఠినమైన శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.




