రూ.50 లక్షలు ఇవ్వకుంటే కొడుకును చంపేస్తాం.. బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపులు

Lawrence Bishnoi: పద్రౌనాకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బీకే సింగ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో రిజిస్టర్డ్ పోస్టు ద్వారా బెదిరింపు లేఖలు కలకలం రేపుతున్నాయి.

G Krishna
Published on: 29 Nov 2026 8:09 PM IST
Lawrence Bishnoi
X

రూ.50 లక్షలు ఇవ్వకుంటే కొడుకును చంపేస్తాం.. బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపులు

Lawrence Bishnoi: పద్రౌనాకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బీకే సింగ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో రిజిస్టర్డ్ పోస్టు ద్వారా బెదిరింపు లేఖలు కలకలం రేపుతున్నాయి. ఆ లేఖలో దుండగులు రూ. 50 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే ఢిల్లీలో ఉంటున్న ఆయన కుమారుడిని చంపేస్తామని, తెలివిగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. బిహార్‌లోని సివాన్ పట్టణ చిరునామాను పేర్కొంటూ, డబ్బు తీసుకుని ఒంటరిగా అక్కడికి రావాలని లేఖలో సూచించారు.

మొదటి లేఖ.. క్లినిక్‌లో కరెంట్ కట్

ఈ బెదిరింపుల పరంపర అక్టోబర్ 2న పంపిన తొలి లేఖతో మొదలైంది. అప్పుడే రూ. 50 లక్షలు ఇవ్వాలని హెచ్చరిస్తూ లేఖ రాశారు. దానికి ఒక్క రోజు ముందు గుర్తు తెలియని యువకుడు క్లినిక్‌లోకి చొరబడి వైర్లు లాగివేయడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ విషయాన్ని డాక్టర్ మౌఖికంగా పద్రౌనా కొత్వాలి పోలీసులకు చెప్పడంతో ఇంటి భద్రతను పెంచారు. అయితే స్థానిక ఆకతాయిల పనిగా భావించి ఆ అంశంపై అంతగా పట్టించుకోకుండా వదిలేశారు.

రెండో లేఖతో భయాందోళనలు.. అల్టిమేటం ఇదే

సరిగ్గా రెండు నెలల తర్వాత నవంబర్ 29 శనివారం రెండో బెదిరింపు లేఖ అందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మొదటి లేఖను తేలికగా తీసుకున్నారని, దీనిని మాత్రం అలా విస్మరించవద్దని ఆ లేఖలో హెచ్చరించారు. ఢిల్లీలో ఉన్న కుమారుడు తమ నిఘాలో ఉన్నాడని, కెనడా నుంచి వస్తున్న ఫోన్ కాల్స్‌కు కూడా స్పందించడం లేదని పేర్కొన్నారు. ఇది చివరి హెచ్చరిక అని, డబ్బు చెల్లించకపోతే డిసెంబర్ 3న కుమారుడి మృతదేహం దొరుకుతుందని బెదిరించారు. డిసెంబర్ 2 ఉదయం 11 గంటలకు సివాన్ కంటోన్మెంట్ టెల్హట్టా మొహల్లా చౌక్‌కు డబ్బుతో రావాలని, అక్కడ ఒకే రంగు దుస్తులు వేసుకున్న ముగ్గురు వ్యక్తులు ఉంటారని లేఖలో తెలిపారు.

పోలీసుల దర్యాప్తు.. ఎస్పీని కలవనున్న బాధిత కుటుంబం

ఈ వ్యవహారాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నట్లు పోలీస్ సూపరింటెండెంట్ కేశవ్ కుమార్ తెలిపారు. లేఖను పద్రౌనా పోస్టాఫీసు నుంచే పోస్టు చేసినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని, స్థానిక దుండగుల ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు చెప్పారు. పోస్టాఫీసు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పద్రౌనా కొత్వాలి ఇన్‌చార్జ్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. లారెన్స్ బిష్ణోయ్ ముఠా పేరుతో రెండోసారి లేఖ రావడంతో కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉందని డాక్టర్ బీకే సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఎస్పీని కలవనున్నట్లు తెలిపారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.