Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిలో షాకింగ్ నిజాలు.. రూ. 3 వేల కోసం 26 మంది బలి!
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి కేసులో NIA సంచలన విషయాలు వెల్లడించింది. రూ. 3 వేల కోసం పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు స్థానికులను అరెస్ట్ చేసింది. ఆ మారణహోమం వెనుక అసలు నిజాలు ఇవే.
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిలో షాకింగ్ నిజాలు.. రూ. 3 వేల కోసం 26 మంది బలి!
Pahalgam Terror Attack: పహల్గాం మారణహోమానికి ఏడాది పూర్తయినా, ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంది. 26 కుటుంబాల్లో చీకటి నింపిన ఆ ఉగ్రదాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తన ఛార్జ్‌షీట్‌లో వెల్లడించింది. కేవలం మూడు వేల రూపాయల కోసం ఇద్దరు స్థానికులు ఉగ్రవాదులకు సహకరించి, అమాయకుల ప్రాణాలు బలిగొన్నట్లు దర్యాప్తులో తేలింది.
గత ఏడాది ఏప్రిల్ 21 రాత్రి 10.30 గంటల సమయంలో ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు స్థానికులైన పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్‌ల వద్ద ఆశ్రయం పొందారు. ఆయుధాలతో వచ్చిన ఆ ఉగ్రవాదులు ఉర్దూ, పంజాబీ భాషల్లో మాట్లాడుకుంటూ లష్కరే తయ్యిబా కమాండర్ సాజిద్ జట్ట్ ప్రస్తావన తెచ్చారు. తమ ప్రాంతంలో భారీ దాడి జరగబోతోందని అర్థమైనా, ఆ ఇద్దరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు.
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి, భోజనం పెట్టినందుకు గానూ పర్వేజ్, బషీర్‌లకు వారు 3 వేల రూపాయలు ఇచ్చారు. మరుసటి రోజు (ఏప్రిల్ 22) మధ్యాహ్నం దాడికి కొన్ని గంటల ముందు ఉగ్రవాదులు బైసరన్ లోయలో కంచె వెనుక దాక్కోవడం చూసినా.. ఈ ఇద్దరూ అధికారులను అప్రమత్తం చేయలేదు. కనీసం తోటి టూరిస్ట్ ఆపరేటర్లకు కూడా చెప్పకుండా, తమ గుర్రాల సవారీ కోసం పర్యాటకుల కోసం వేచి చూశారు.
మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో పర్యాటకులను లోయలోకి తీసుకెళ్లిన కొద్దిసేపటికే కాల్పుల మోత మొదలైంది. తమ కళ్లముందే పర్యాటకులు రక్తసిక్తమై పడిపోతున్నా, తమకేం సంబంధం లేదన్నట్టుగా పర్వేజ్, బషీర్ అక్కడి నుంచి జారుకున్నారు. గతేడాది జూన్ 22న వీరిని అరెస్ట్ చేసిన NIA, సాజిద్ జట్ట్‌తో పాటు వీరిపై కూడా ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.




