Pahalgam Attack : పహల్గామ్ టెర్రర్ అటాక్‌లో కొత్త ట్విస్ట్.. NIA దర్యాప్తులో సంచలన అంశాలు.!

Pahalgam Attack : భారతదేశాన్ని వణికించిన పహల్గామ్ ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), జమ్మూ కాశ్మీర్ పోలీసులు జరిపిన ఉమ్మడి విచారణలో అంతర్జాతీయ..

G Krishna
Published on: 1 Jun 2026 10:55 AM IST
Pahalgam Attack
X

Pahalgam Attack

Pahalgam Attack : భారతదేశాన్ని వణికించిన పహల్గామ్ ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), జమ్మూ కాశ్మీర్ పోలీసులు జరిపిన ఉమ్మడి విచారణలో అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌కు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 26 మంది ప్రాణాలను బలిగొన్న ఈ దాడిలో ఉగ్రవాదులు ఉపయోగించిన సెల్‌ఫోన్లలో ఒకటి పాకిస్తాన్‌కు చెందిన ఒక ప్రముఖ బ్యాంకు నిధులతో దిగుమతి అయినట్లు దర్యాప్తులో తేలింది. గతంలోనే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొన్న కరాచీకి చెందిన 'ఫైసల్ బ్యాంక్' (Faysal Bank) ద్వారా ఈ ఫోన్ల కొనుగోలుకు ఫైనాన్స్ జరిగినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైళ్లు

జమ్మూ కాశ్మీర్‌లోని దాచిగామ్ అడవుల్లో (ముల్నార్ మహాదేవ్ ప్రాంతంలో) 2025, జూలై 28న జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో ఫైసల్ జట్ (అలియాస్ సులేమాన్ షా), హబీబ్ తాహిర్ (అలియాస్ జిబ్రాన్), హంజా అఫ్ఘానీ అనే ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి మృతదేహాల వద్ద నుంచి భద్రతా దళాలు రెండు షియోమి (Xiaomi) రెడ్‌మి సిరీస్ మొబైళ్లను స్వాధీనం చేసుకున్నాయి. అందులో ఒకటి 2021 నాటి ఆరెంజ్ కలర్ 'రెడ్‌మి 9T' కాగా, మరొకటి 2023 నాటి బ్లాక్ కలర్ 'రెడ్‌మి నోట్ 12'. ఈ ఫోన్ల ఆధారంగా అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరపడంతో అసలు గుట్టు రట్టయింది.

కరాచీ బ్యాంకు అడ్రస్‌తో..

భారత నిఘా సంస్థలు 'షియోమి గ్లోబల్' (Xiaomi Global) సంస్థను సంప్రదించగా ఆసక్తికరమైన వివరాలు బయటపడ్డాయి. ఉగ్రవాదులు వాడిన రెడ్‌మి 9T ఫోన్, 2021 జనవరి 1న పాకిస్తాన్‌కు చెందిన 'టెక్ సిరత్ ప్రైవేట్ లిమిటెడ్' అనే కంపెనీ దిగుమతి చేసుకున్న కన్సైన్‌మెంట్‌లో భాగమని తేలింది. ఈ దిగుమతికి సంబంధించిన లాజిస్టిక్స్ కంపెనీగా పాకిస్తాన్‌లోని ప్రముఖ ఇస్లామిక్ బ్యాంక్ అయిన 'ఫైసల్ బ్యాంక్' పేరు నమోదై ఉంది. అంతేకాకుండా ఆ ఫోన్ల డెలివరీ అడ్రస్ కూడా కరాచీలోని షారా-ఇ-ఫైసల్ రోడ్డులో ఉన్న 'ఫైసల్ హౌస్, మెయిన్ బ్రాంచ్' గా రికార్డై ఉండటం గమనార్హం.

సాధారణ వ్యాపార ప్రక్రియలో భాగంగా టెక్ సిరత్ కంపెనీకి ఈ బ్యాంకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (LC) ద్వారా ఆర్థిక సహాయం (ఫైనాన్స్) అందించింది. అయితే ఈ కన్సైన్‌మెంట్‌ నుంచి సదరు మొబైల్‌ను ఎవరికీ తెలియకుండా లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థకు చేరవేశారని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు.

దాడి కోసమే దాచి ఉంచిన ఫోన్లు

ఈ దర్యాప్తులో అత్యంత విస్తుపోయే విషయం ఏంటంటే.. ఈ రెండు ఫోన్లను వరుసగా 2021, 2023 సంవత్సరాలలోనే పాకిస్తాన్‌కు దిగుమతి చేసినప్పటికీ, 2025 ఏప్రిల్ 22న పహల్గామ్ దాడి జరిగే వరకు వాటిని ఒక్కసారి కూడా స్విచ్ ఆన్ చేయలేదు. కేవలం ఉగ్రదాడికి ముందు మాత్రమే వీటిని మొదటిసారి ఆన్ చేశారు. అంటే, భవిష్యత్తులో పెద్ద ఉగ్రదాడికి ఉపయోగించడం కోసమే ఆ కన్సైన్‌మెంట్‌ల నుండి వీటిని ముందే దొంగిలించి, ఎవరూ ట్రాక్ చేయకుండా చాలా కాలం పాటు అత్యంత రహస్యంగా దాచి ఉంచారని అధికారులు నిర్ధారించారు. ఇక రెండవ ఫోన్ అయిన రెడ్‌మి నోట్ 12 మొబైల్‌ను లాహోర్‌కు చెందిన 'ఎయిర్ లింక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్' అనే సంస్థ దిగుమతి చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

ఫైసల్ బ్యాంకుకు ఉన్న పాత టెర్రర్ లింకులు

పహల్గామ్ దాడితో ఫైసల్ బ్యాంకుకు నేరుగా సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించనప్పటికీ, ఈ బ్యాంకుకు ఉగ్రవాద విచారణలతో పాత చరిత్రే ఉంది. అమెరికాపై 9/11 దాడుల అనంతరం జరిగిన విచారణల ప్రకారం.. అమెరికా నిషేధించిన పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (LeT) తో పాటు అల్-ఖైదాతో సంబంధాలున్న కువైట్ ఆధారిత 'లజ్నత్ అల్-దవా' అనే ఉగ్రవాద సంస్థలకు ఫైసల్ బ్యాంక్‌లో డిపాజిట్ ఖాతాలు ఉన్నట్లు గతంలో 'న్యూయార్క్ టైమ్స్' నివేదించింది.

అలాగే 2002 నాటి 'డాన్' పత్రిక నివేదికల ప్రకారం.. పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హర్కతుల్ ముజాహిదీన్ వంటి పలు నిషేధిత ఉగ్రవాద సంస్థల బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించినప్పుడు, ఆయా సంస్థలు ఫైసల్ బ్యాంక్‌తో సహా పలు కమర్షియల్ బ్యాంకుల్లో స్థానిక, విదేశీ కరెన్సీ ఖాతాలను నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి.

ఫోన్లలో లభించిన రహస్య మ్యాప్‌లు, ఫోటోలు

ఉగ్రవాదులు సెల్యులార్ నెట్‌వర్క్, ఇంటర్నెట్‌పై ఆధారపడకుండా సుదూర ప్రాంతాలకు సురక్షితంగా సమాచారం పంపే 'లాంగ్ రేంజ్ రేడియో కమ్యూనికేషన్ టెక్నాలజీ'ని ఉపయోగించడం వల్ల వారి ఫోన్ల నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ డేటాను రికార్డ్ చేయలేకపోయారు. అయినప్పటికీ, ఆ ఫోన్ల నుంచి పహల్గామ్‌లోని 'బైసారన్ మెడోస్' , దాని చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన కొన్ని కీలకమైన ఫోటోలు, మ్యాప్‌లను ఇన్వెస్టిగేటర్లు రికవరీ చేశారు.

ఇందులో 2025 మార్చి 30 నాటి ఒక టెంట్ ఫోటో కూడా ఉంది. దాడికి కొన్ని వారాల ముందే ఉగ్రవాదులు ఒక ఎత్తైన కొండ ప్రాంతంలో స్టవ్‌తో సహా ఈ టెంట్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు ఆ ఫోటో ద్వారా స్పష్టమైంది. భద్రతా దళాల కదలికలను పైనుంచి పర్యవేక్షించి, వ్యూహాత్మకంగా దాడి చేయడం కోసమే వారు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు అధికారులు గుర్తించారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story