Ship Sinks: ఒడిశా తీరంలో ఘోరం.. సముద్రంలో మునిగిపోయిన నౌక.. 24 మంది గల్లంతు
Ship Sinks: ఒడిశాలోని పారాదీప్ తీరానికి సమీపంలో బంగాళాఖాతంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
Ship Sinks
Ship Sinks: ఒడిశాలోని పారాదీప్ తీరానికి సమీపంలో బంగాళాఖాతంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పనామా జెండాతో పయనిస్తున్న ఒక భారీ సరుకు రవాణా నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ నౌకలో 24 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం అందడంతో ఇండియన్ కోస్ట్ గార్డ్, భారత్ నావికాదళం వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ఒడిశాలోని పారాదీప్ పోర్ట్ నుంచి శుక్రవారం రాత్రి 1700 టన్నుల ఐరన్ ఓర్ ఫైన్స్ (ఇనుప ఖనిజం) లోడుతో ఈ నౌక సింగపూర్ వైపు బయలుదేరింది. తీరం నుంచి దాదాపు 240 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ నౌక సముద్రంలో మునిగిపోయింది. నౌక నుంచి సిగ్నల్స్ నిలిచిపోవడంతో వెంటనే అలర్ట్ అయిన పారాదీప్ పోర్ట్ అధికారులు, రక్షణ బృందాలకు సమాచారం అందించారు. ఈ నౌకలో ప్రయాణిస్తున్న 24 మంది సిబ్బందిలో 20 మంది చైనా పౌరులు కాగా, ముగ్గురు మయాన్మార్ వాసులు, ఒకరు బంగ్లాదేశ్ పౌరుడని కోస్ట్ గార్డ్ కమాండెంట్ అమిత్ ఉనియాల్ వెల్లడించారు.
రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్, నావికాదళం
ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఇండియన్ కోస్ట్ గార్డ్, భారత్ నేవీ సంయుక్తంగా సెర్చింగ్, సహాయక చర్యలు ప్రారంభించాయి. హెలికాప్టర్లు, రెస్క్యూ బౌట్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. లైఫ్ రాఫ్ట్ సాయంతో సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరు సిబ్బందిని రక్షణ బృందాలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. మిగిలిన సిబ్బంది జాడ కోసం గాలింపు తీవ్రతరం చేశారు. సముద్రంలో ఆ సమయానికి ప్రయాణిస్తున్న ఇతర వాణిజ్య నౌకలను కూడా రక్షణ శాఖ అప్రమత్తం చేసి, సహాయక చర్యల్లో భాగస్వాములను చేసింది.
ప్రమాదానికి కారణాలపై స్పష్టత కరవు
నౌక సముద్రంలో మునిగిపోవడానికి గల అసలు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల సముద్రంలో అలల తీవ్రత పెరిగి నౌక మునిగిపోయిందా లేక సాంకేతిక లోపం ఏమైనా తలెత్తిందా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. జాతీయ భద్రతా విభాగంతో పాటు ఒడిశా సీనియర్ ఐపీఎస్ అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. గాలింపు చర్యలు వేగవంతం చేసినప్పటికీ, లోతైన సముద్ర ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది.




