రేపటి నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. ఈ 5 బిల్లులపైనే అందరి కన్ను.!
Parliament Monsoon Session 2026 : కేంద్ర ప్రభుత్వం జులై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధం చేసింది. ఆగస్టు 13 వరకు సాగే..
parliament monsoon session 2026
Parliament Monsoon Session 2026 : కేంద్ర ప్రభుత్వం జులై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధం చేసింది. ఆగస్టు 13 వరకు సాగే ఈ ఉమ్మడి సమావేశాల్లో 5 సరికొత్త బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు, గతంలో పెండింగ్‌లో ఉన్న రెండు బిల్లులను ఆమోదించడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆదాయపు పన్ను సంస్కరణలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు, ఎంఎస్ఎంఈ చట్టాల్లో మార్పుల వంటి కీలక ప్రతిపాదనలు ఈ బిల్లుల్లో ఉండటంతో ఈ సెషన్ దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది.
పార్లమెంట్ ముందుకు రానున్న ఆ ఐదు కొత్త బిల్లులు
ఈ సమావేశాల్లో ప్రభుత్వం ముందుకు తీసుకురాబోతున్న ఐదు కొత్త బిల్లులలో దేశ ఆర్థిక, న్యాయ వ్యవస్థలపై ప్రభావం చూపే కీలక చట్టాలు ఉన్నాయి. అందులో మొదటిది దేశంలో ఐటీ రిఫార్మ్స్ తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ఆదాయపు పన్ను సవరణ బిల్లు కాగా, రెండోది సుప్రీంకోర్టులో కేసుల భారాన్ని తగ్గించేందుకు జడ్జీల సంఖ్యను పెంచేలా రూపొందించిన సుప్రీంకోర్టు సవరణ బిల్లు. ఈ రెండూ గతంలో తెచ్చిన ఆర్డినెన్స్ ల స్థానంలో రానున్నాయి. వీటితో పాటు బర్త్, డెత్ సర్టిఫికేట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు జనన, మరణాల నమోదు సవరణ బిల్లును, దేశ ప్రతిష్టను, జాతీయ చిహ్నాలను కించపరిచే వారిపై కఠిన చర్యల కోసం జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే సవరణ బిల్లును ప్రవేశపెడుతున్నారు. అలాగే దేశీయంగా చిన్న పరిశ్రమలను బలోపేతం చేసేందుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లును కూడా తీసుకువస్తున్నారు. ఇవే కాకుండా గతంలో పార్లమెంట్ ముందుకు వచ్చి పెండింగ్‌లో ఉన్న విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు, వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లులను కూడా ప్రభుత్వం ఈ సెషన్‌లో ఆమోదించుకోవాలని చూస్తోంది.
హీట్ పుట్టించనున్న సర్వపక్ష సమావేశం.. విపక్షాల అస్త్రాలు ఇవే
సమావేశాలు సజావుగా సాగేందుకు వీలుగా ప్రభుత్వం ఈరోజు ఒక సర్వపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో తాము తీసుకురాబోయే బిల్లుల గురించి రాజకీయ పార్టీలకు కేంద్రం వివరించనుంది. అయితే, ఈసారి సమావేశాల్లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు ప్రతిపక్షాలు కూడా వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా దేశాన్ని కుదిపేసిన నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారం, ఆపరేషన్ సింధూర్ లో సైనికుల మరణాలపై రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు, లడఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను జంతర్ మంతర్ నుండి ఆసుపత్రికి తరలించిన అంశాలపై విపక్షాలు సభలో రచ్చ చేసేందుకు రెడీ అయ్యాయి. అలాగే వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మళ్లీ తెస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పష్టం చేశారు.
రాజకీయ సమీకరణాల మధ్య రసవత్తరంగా సెషన్
ఈ వర్షాకాల సమావేశాలకు ముందే పార్లమెంట్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది రెబెల్ ఎంపీలు నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమై, ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. లోక్‌సభ స్పీకర్ కూడా వీరికి ప్రత్యేక సిట్టింగ్ ఏర్పాట్లను ఆమోదించారు. దీనికి తోడు శివసేన ఉద్ధవ్ పక్షం నుండి ఆరుగురు లోక్‌సభ ఎంపీలు ఏకనాథ్ షిండే వర్గంలో చేరగా, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు ఇప్పటికే బీజేపీ గూటికి చేరారు. ఈ రాజకీయ ఫిరాయింపుల ద్వారా ప్రభుత్వం పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజార్టీ సాధించేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలోనే వాదోపవాదాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.




