Parliament Sessions : జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. ఈసారి సభ ముందుకు రానున్న కీలక బిల్లులు ఇవే
Parliament Sessions : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జీల పెంపు, జాతీయ గీతానికి అవమానాల నివారణ వంటి పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది.
Parliament Sessions
Parliament Sessions : దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ విడత సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలకమైన చట్టాలను తీసుకురావడానికి పక్కా ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే లోక్‌సభ సచివాలయం సభలో చర్చించాల్సిన అంశాల అజెండాను కూడా అధికారికంగా ఖరారు చేసింది. పర్యావరణం, ఆర్థికం, సామాజిక అంశాలకు సంబంధించిన పలు కీలక బిల్లులు ఈసారి చట్టసభల ముందుకు రాబోతున్నాయి.
జాతీయ గీతాన్ని అవమానిస్తే కఠిన శిక్షలు
ఈ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకురాబోయే అత్యంత కీలకమైన బిల్లుల్లో 'జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు-2026' ఒకటి. మన జాతీయ గీతాలైన జనగణమన, వందేమాతరం పాడుతున్నప్పుడు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అవమానించినా లేదా మధ్యలో అంతరాయం కలిగించినా దానిని తీవ్రమైన నేరంగా పరిగణించేలా ఈ కొత్త చట్టాన్ని డిజైన్ చేశారు. ఇలాంటి పనులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా ఈ బిల్లులో నిబంధనలను పొందుపరిచారు.
విదేశీ విరాళాలకు బ్రేక్
దేశంలోకి వచ్చే విదేశీ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కేంద్రం గట్టి చర్యలు తీసుకోబోతోంది. ఇందులో భాగంగా విదేశీ విరాళాల నియంత్రణ (FCRA) సవరణ బిల్లు-2026ను సభలో ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ ఎక్కడికి వెళ్తున్నాయనే దానిపై నిఘా పెరుగుతుంది. వీటితో పాటు జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు-2026ను కూడా తీసుకురానున్నారు. పుట్టుక, చావుల రిజిస్ట్రేషన్లను లేట్‌గా చేసే వారి కోసం నిబంధనలను ఈ బిల్లు ద్వారా మరింత కఠినతరం చేయనున్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కేసుల భారాన్ని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతమున్న 33 నుంచి 37కి పెంచేందుకు సంబంధించిన బిల్లును సభ ముందు ఉంచనున్నారు. దీనితో పాటు విద్యా రంగంలో సంస్కరణల కోసం విక్షిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు-2025, వ్యాపారస్తుల కోసం ఆదాయపు పన్ను సవరణ బిల్లు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) అభివృద్ధికి సంబంధించిన కీలక సవరణ బిల్లులను ఈ సమావేశాల్లోనే ఆమోదించనున్నారు.
రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
ప్రస్తుతం ఎంపీలకు పంపిణీ చేసిన ప్రాథమిక అజెండా లిస్ట్‌లో 130వ, 131వ రాజ్యాంగ సవరణ బిల్లుల పేర్లు లేవు. అయినప్పటికీ రాజకీయ వర్గాల్లో వీటిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ బిల్లులను మొదట బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC)లో చర్చించి ఆ తర్వాత సభ ముందుకు తెస్తారా లేదా కేంద్ర ప్రభుత్వం నేరుగా సభలోనే ప్రవేశపెడుతుందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లుల వెనుక ఉన్న అసలు అంశాలు ఏంటనేవి ఇంకా బయటకు రాలేదు.
స్మార్ట్ వాచ్‌లు, పెన్ కెమెరాలపై బ్యాన్
సమావేశాలు ప్రశాంతంగా, నిబంధనల ప్రకారం సాగేలా చూసేందుకు లోక్‌సభ సచివాలయం ఎంపీలకు కొన్ని గట్టి రూల్స్ పెట్టింది. సభ లోపలికి స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ కళ్లద్దాలు, పెన్ కెమెరాల లాంటి ఎలాంటి నిఘా లేదా రికార్డింగ్ పరికరాలను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వీటితో పాటు పార్లమెంట్ హౌస్ ఆవరణలో ఎలాంటి ధర్నాలు, రాజకీయ నిరసనలు, నినాదాలు చేయకూడదని, వాటిపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.




