పతంజలి నెయ్యి వాడుతున్నారా? అయితే ఒకసారి ఇది చూడండి..!

దీపావళి పండుగ వేళ మార్కెట్‌లో లభించే ఆహార పదార్థాల నాణ్యతపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) జరిపిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర కలకలం రేపాయి.

G Krishna
Published on: 3 Nov 2026 2:04 PM IST
patanjali-ghee
X

patanjali-ghee

దీపావళి పండుగ వేళ మార్కెట్‌లో లభించే ఆహార పదార్థాల నాణ్యతపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) జరిపిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర కలకలం రేపాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రత్యేక ప్రచారంలో ఏకంగా రూ. 9.01 కోట్ల విలువైన కల్తీ, నాసిరకం ఆహార పదార్థాలను అధికారులు జప్తు చేశారు. పండుగల సమయాన్ని ఆసరాగా చేసుకుని కల్తీ సరుకులు అమ్ముతున్న వ్యాపారుల గుట్టును ఎఫ్‌డీఏ రట్టు చేసింది.

పతంజలి ఆవు నెయ్యి భారీగా సీజ్

అయితే ఈ దాడుల్లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయమేమిటంటే... ప్రముఖ ఆయుర్వేద బ్రాండ్ 'పతంజలి'కి చెందిన ఆవు నెయ్యి భారీగా సీజ్ కావడం! ఛత్రపతి శంభాజీనగర్‌లోని పతంజలి ఆయుర్వేద్ 'సూపర్ డిస్ట్రిబ్యూటర్' అయిన 'దివ్య మహావితారక్' వద్ద ఎఫ్‌డీఏ జరిపిన సోదాల్లో మిస్‌బ్రాండింగ్, కల్తీ అనుమానంతో రూ. 20.20 లక్షల విలువైన 2,279.7 లీటర్ల (4,032 డబ్బాల) పతంజలి ఆవు నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఆహార భద్రత , ప్రమాణాల చట్టం (FSS Act, 2006) నిబంధనలకు స్పష్టమైన ఉల్లంఘనగా ప్రాథమికంగా తేలింది.

19 సంస్థల లైసెన్సులు రద్దు.. డి-మార్ట్ సరుకులు కూడా

ఈ తనిఖీల ధాటికి కేవలం నెయ్యి మాత్రమే కాదు, మహారాష్ట్రవ్యాప్తంగా పలు ప్రముఖ వ్యాపార సంస్థల లీలలు కూడా బయటపడ్డాయి. ముంబై, అమరావతి, ఛత్రపతి శంభాజీనగర్ ప్రాంతాల్లోని నమ్కీన్, మిఠాయిలు, మసాలా దినుసుల తయారీ కేంద్రాలలో తీవ్రమైన పరిశుభ్రతా లోపాలు, పురుగుల నివారణ రికార్డులు లేకపోవడంతో ఏకంగా 19 సంస్థల లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. అలాగే భివండిలోని అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ (D-Mart) నుంచి లక్షా 44 వేల కిలోలకు పైగా వంటనూనెను, సతారాలోని అమీన్ ట్రేడర్స్ నుంచి 20 వేల కిలోలకు పైగా బియ్యం, పప్పుధాన్యాలను, పుణే డివిజన్ పరిధిలో భారీగా వంటనూనె నిల్వలను సీజ్ చేశారు.

కేసలు, అరెస్టులు.. ఇ-కామర్స్ దిగ్గజాలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) నోటీసులు

అక్టోబర్ చివరి వారంలో జరిపిన ఈ దాడుల్లో 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 16 మందిని అరెస్ట్ చేయడంతో పాటు 7 కేంద్రాలను సీల్ చేశారు. అంతేకాకుండా నాసిక్, నాగ్‌పూర్ పరిధిలోని హోటళ్లు, దాబాలకు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు 'టాటా 1mg మెరైన్ కొల్లాజెన్ పౌడర్' ప్రచారంలో లేబులింగ్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై టాటా 1mg, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలకు FSSAI షోకాజ్ నోటీసులు పంపడంతో, మనం నిత్యం కొనుగోలు చేసే బ్రాండెడ్ వస్తువుల నాణ్యతపై వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.