Pawan Khera: పవన్ ఖేరాకు న్యాయస్థానంలో చుక్కెదురు.. ముందస్తు బెయిల్ నిరాకరించిన గువాహటి కోర్టు!
Pawan Khera: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాకు గువాహటి కోర్టులో చుక్కెదురైంది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
Pawan Khera: పవన్ ఖేరాకు న్యాయస్థానంలో చుక్కెదురు.. ముందస్తు బెయిల్ నిరాకరించిన గువాహటి కోర్టు!
Pawan Khera: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరాకు అస్సాంలో భారీ షాక్ తగిలింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ భార్య రిణికి భూయాన్ శర్మ దాఖలు చేసిన కేసులో పవన్ ఖేరా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను గువాహటి హైకోర్టు తిరస్కరించింది.
ఇటీవల ఒక మీడియా సమావేశంలో పవన్ ఖేరా మాట్లాడుతూ.. సీఎం భార్య రిణికి భూయాన్ శర్మకు ఒకటి కంటే ఎక్కువ పాస్‌పోర్టులు ఉన్నాయని, విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాలను సీఎం తన ఎన్నికల అఫిడవిట్‌లో దాచారని ఆయన విమర్శించారు. అయితే, ఈ ఆరోపణలను సీఎం తోసిపుచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగించారని రిణికి భూయాన్ శర్మ గువాహటి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఖేరాపై కేసు నమోదైంది.
తొలుత తెలంగాణ హైకోర్టు ఈ కేసులో వారం రోజుల పాటు తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, సుప్రీంకోర్టు ఆ తర్వాత ఈ బెయిల్‌పై స్టే విధించింది. బెయిల్ కోసం అస్సాంలోని సంబంధిత కోర్టుకే వెళ్లాలని స్పష్టం చేసింది. ఈ నెల 21న ఇరుపక్షాల వాదనలు విన్న గువాహటి హైకోర్టు, తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఖేరా పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించడంతో పవన్ ఖేరా అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.




