Petrol: వాహ‌న‌దారుల‌కు కేంద్రం గుడ్ న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకం మిన‌హాయింపు

Petrol: ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Mokshith
Published on: 11 Jun 2026 11:35 AM IST
Petrol
X

Petrol: వాహ‌న‌దారుల‌కు కేంద్రం గుడ్ న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకం మిన‌హాయింపు

Petrol: ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 22%, 25%, 27%, 30% ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా మినహాయించింది. భారత ప్రమాణాల సంస్థ (BIS) నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఇంధన మిశ్రమాలకు "నిల్ ఎక్సైజ్ డ్యూటీ" (శూన్య సుంకం) వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌కు కేంద్రం గుడ్ న్యూస్

కేంద్ర రెవెన్యూ శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, ఇథనాల్ శాతం ఎక్కువగా ఉన్న పెట్రోల్ మిశ్రమాలపై ఇకపై కేంద్ర ఎక్సైజ్ సుంకం ఉండదు. ప్రస్తుతం భారత్‌లో ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, రైతులకు అదనపు ఆదాయం కల్పించడం, కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో 22%, 25%, 27%, 30% ఇథనాల్ కలిగిన పెట్రోల్‌కు పన్ను రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది.

22% ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌కు నిబంధనలు ఏంటి?

గెజిట్ ప్రకారం 22% ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌గా గుర్తించాలంటే.. మొత్తం మిశ్రమంలో 78% పెట్రోల్ ఉండాలి.

22% ఇథనాల్ ఉండాలి. పెట్రోల్‌పై సంబంధిత ఎక్సైజ్ సుంకాలు చెల్లించి ఉండాలి. ఇథనాల్‌పై కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత లేదా సమగ్ర జీఎస్టీ (IGST) వంటి పన్నులు చెల్లించి ఉండాలి. భారత ప్రమాణాల సంస్థ నిర్దేశించిన IS 19850 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఈ నిబంధనలు పాటించినప్పుడు మాత్రమే ఎక్సైజ్ సుంకం మినహాయింపు లభిస్తుంది.

25%, 27%, 30% ఇథనాల్ మిశ్రమాలకు కూడా..

22% మిశ్రమానికి వర్తించే నిబంధనలే 25%, 27%తో పాటు 30% ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌కూ వర్తిస్తాయి. ఉదాహరణకు 30% ఇథనాల్ మిశ్రమంలో 70% పెట్రోల్, 30% ఇథనాల్ ఉండాలి. సంబంధిత పన్నులు చెల్లించి ఉండాలి. BIS నిర్దేశించిన IS 19850 ప్రమాణాలను పాటించాలి. ఈ ప్రమాణాలను అనుసరించే అన్ని మిశ్రమాలకు కేంద్ర ఎక్సైజ్ సుంకం పూర్తిగా మాఫీ అవుతుంది.

BIS ప్రమాణాల ప్రాధాన్యత ఏమిటి?

భారత ప్రమాణాల సంస్థ (BIS) రూపొందించిన IS 19850 ప్రమాణం ఇంధన నాణ్యత, భద్రత, వాహనాలకు అనుకూలత వంటి అంశాలను నిర్ధారిస్తుంది. ఇథనాల్ శాతం పెరిగినప్పుడు ఇంధన నాణ్యతలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే BIS ప్రమాణాలను తప్పనిసరి చేసింది. ఈ ప్రమాణాలను పాటించే ఇంధనానికే పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

'అప్రోప్రియేట్ డ్యూటీస్' అంటే ఏంటి?

నోటిఫికేషన్‌లో పేర్కొన్న "అప్రోప్రియేట్ డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్" అంటే.. కేంద్ర ఎక్సైజ్ చట్టం, 1944 ప్రకారం విధించే ఎక్సైజ్ సుంకాలు, ఫైనాన్స్ యాక్ట్ 2018 కింద అదనపు ఎక్సైజ్ సుంకం, ఫైనాన్స్ యాక్ట్ 2002 కింద ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం, ఫైనాన్స్ యాక్ట్ 2021 కింద విధించే అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ (AIDC). ఇవి చెల్లించిన ఇంధన మిశ్రమాలకే ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

ఈ నిర్ణయం వల్ల కలిగే ప్రయోజనాలు

ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం మినహాయింపు ఇవ్వడం వల్ల. దేశంలో ఎథనాల్ వినియోగం పెరుగుతుంది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. చెరకు, మొక్కజొన్న వంటి పంటలు పండించే రైతులకు అదనపు మార్కెట్ లభిస్తుంది. ఇంధన రంగంలో స్వావలంబన పెరుగుతుంది. కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమానికి మరింత ఊతమివ్వడంతో పాటు, గ్రీన్ ఇంధనాల వినియోగాన్ని వేగవంతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story