Government Holidays 2027: సోషల్ మీడియాలో ప్రభుత్వ సెలవులపై తప్పుడు ప్రచారం.. PIB ఫ్యాక్ట్ చెక్‌తో అసలు విషయం వెల్లడి!
Government Holidays 2027: 2027 ప్రభుత్వ సెలవుల జాబితాపై వైరల్ అవుతున్న తప్పుడు ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. అధికారిక వివరాలు వెల్లడించింది.
Government Holidays 2027: సోషల్ మీడియాలో ప్రభుత్వ సెలవులపై తప్పుడు ప్రచారం.. PIB ఫ్యాక్ట్ చెక్‌తో అసలు విషయం వెల్లడి!
Government Holidays 2027: 2027లో ఢిల్లీ, న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ప్రకటించిన మతపరమైన సెలవుల విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పుదోవ పట్టించేలా ఉందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ప్రభుత్వ సెలవుల జాబితాలో మైనారిటీ మతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ సోషల్ మీడియాలో చేసిన వాదనలో వాస్తవం లేదని వెల్లడించింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్
‘ఇండియా ఎగైనెస్ట్ రిజర్వేషన్’ అనే ఎక్స్ (X) ఖాతా 2027 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులపై ఓ పోస్టు చేసింది. మోదీ ప్రభుత్వం ప్రకటించిన 14 ప్రభుత్వ సెలవుల్లో మూడు జాతీయ సెలవులు కాగా, మిగిలిన 11 సెలవుల్లో ముస్లింలకు నాలుగు, హిందువులకు రెండు, క్రైస్తవులకు రెండు, బౌద్ధులకు ఒకటి, జైనులకు ఒకటి, సిక్కులకు ఒకటి కేటాయించారని పేర్కొంది. ఈ జాబితా భారతదేశానిదా లేక పాకిస్థాన్‌దా అంటూ ప్రశ్నించింది.
PIB ఫ్యాక్ట్ చెక్ ఏమి చెప్పిందంటే?
ఈ ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న సెలవుల లెక్క తప్పు అని స్పష్టం చేసింది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని సిబ్బంది, శిక్షణ విభాగం (DoPT) జారీ చేసిన అధికారిక సర్క్యులర్ ప్రకారం.. ఢిల్లీ, న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు 2027 సంవత్సరంలో మొత్తం 17 తప్పనిసరి (గెజిటెడ్) సెలవులు ప్రకటించినట్లు వెల్లడించింది. ఇందులో ఐదు ప్రధాన పండుగలకు సంబంధించిన సెలవులు ఉన్నాయని పేర్కొంది.
మరో మూడు సెలవుల ప్రస్తావనను విస్మరించిన పోస్ట్
అధికారిక ప్రకటనలోని మరో ముఖ్యమైన అంశాన్ని సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రస్తావించలేదని PIB తెలిపింది. మొదట పేర్కొన్న సెలవులతో పాటు అదనంగా మరో మూడు తప్పనిసరి సెలవులను కూడా ఎంచుకునే అవకాశం ఉందనే విషయాన్ని ఆ పోస్టు విస్మరించిందని వివరించింది. అలాగే 12 ఐచ్ఛిక సెలవుల జాబితా నుంచి కూడా ఉద్యోగులు తమకు అనుగుణంగా సెలవులను ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది.
2027 సంవత్సరానికి సంబంధించి ఢిల్లీ, న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పరిపాలనా కార్యాలయాల్లో అమలయ్యే ఈ సెలవుల వివరాలను సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ 2026 జూలై 16న జారీ చేసిన కార్యాలయ మెమోరాండంలో పేర్కొంది.
ధృవీకరించకుండా పోస్టులు షేర్ చేయొద్దు
సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని గుడ్డిగా నమ్మవద్దని PIB ఫ్యాక్ట్ చెక్ పౌరులకు సూచించింది. ఏదైనా వార్త లేదా ప్రభుత్వ ప్రకటనకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసే ముందు అధికారిక వనరుల ద్వారా ధృవీకరించుకోవాలని తెలిపింది. ధృవీకరించని, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దని హెచ్చరించింది.




