PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. రేపే ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు
పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు అక్టోబర్ 30న రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ప్రధాని మోదీ గుజరాత్ వేదికగా ఈ నిధులను విడుదల చేయనున్నారు.
PM Kisan
PM Kisan: అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ అందించనుంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత డబ్బులు విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 30వ తేదీన గుజరాత్‌లోని బనాస్‌కంఠ జిల్లాలో జరిగే ప్రత్యేక జాతీయ స్థాయి కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ విడత ద్వారా దేశంలోని సుమారు 9.34 కోట్ల మందికి పైగా రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి రూ.18,680 కోట్లకు పైగా ఆర్థిక సహాయం నేరుగా జమ కానుంది.
లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందా?
ఈ పథకం కింద ప్రతి ఏడాది అర్హులైన రైతు కుటుంబాలకు కేంద్రం రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున మూడు విడతల్లో ఈ డబ్బులు నేరుగా అందుతాయి. అయితే రేపు మీ ఖాతాలో డబ్బులు పడతాయో లేదో తెలుసుకోవడానికి రైతులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. పోర్టల్‌లోని నో యువర్ స్టేటస్ ఆప్షన్ ద్వారా మీ రిజిస్ట్రేషన్ నంబర్, ఓటీపీ నమోదు చేసి మీ అర్హతను సులభంగా చెక్ చేసుకోవచ్చు. గతంలో డబ్బులు పడినప్పటికీ, ప్రస్తుత జాబితాలో పేరు ఉందా లేదా అనేది ఇలా నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.
ఈ సమస్యలు ఉంటే డబ్బులు రావు
స్టేటస్ చెక్ చేసే సమయంలో కొన్ని రకాల పదాలు కనిపిస్తే మీ కిసాన్ డబ్బులు ఆగిపోయే అవకాశం ఉంది. ఉదాహరణకు మీ స్టేటస్‌లో విత్‌హెల్డ్ అని ఉంటే సాంకేతిక కారణాల వల్ల మీ కిస్తా ఆగిపోయినట్టే. అలాగే అండర్ వెరిఫికేషన్ లేదా ఎలిజిబిలిటీ అండర్ రివ్యూ అని కనిపిస్తే వెంటనే సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించి అవసరమైన పత్రాలను సమర్పించాలి. భూమి రికార్డుల పరిశీలన, ఈ-కేవైసీ తదితర ప్రక్రియలు పూర్తి కాకపోతే రాబోయే విడతల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి.
ఎవరు అర్హులు? అప్లై చేసుకోవడం ఎలా?
సొంతంగా వ్యవసాయ భూమి కలిగి ఉన్న రైతు కుటుంబాలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అయితే ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇంజనీర్లు, డాక్టర్లు లేదా రూ.10,000 కంటే ఎక్కువ పింఛను పొందే వారు దీనికి అనర్హులు. అలాగే ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ ఈ లబ్ధి పొందేందుకు నిబంధనలు అంగీకరించవు. ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా పుస్తకం, భూమి పత్రాలు, మొబైల్ నంబర్ వంటి వివరాలతో అధికారిక పోర్టల్ లేదా సమీపంలోని సీఎస్సీ కేంద్రం ద్వారా రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు.




