PM Modi: ‘ఇదే నా చివరి సభ.. బీజేపీ ప్రమాణస్వీకారానికి మళ్లీ వస్తా’..
PM Modi: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచార ముగింపు సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మే 4న బీజేపీ ప్రమాణ స్వీకారానికి మళ్లీ వస్తానని ధీమా వ్యక్తం చేశారు.
PM Modi: ‘ఇదే నా చివరి సభ.. బీజేపీ ప్రమాణస్వీకారానికి మళ్లీ వస్తా’..
PM Modi: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంది. మరికొన్ని గంటల్లో ప్రచార పర్వానికి తెరపడనున్న నేపథ్యంలో, ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ఆకర్షించేందుకు తుది ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్యారక్‌పూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో బీజేపీ విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బ్యారక్‌పూర్ ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోదీ, ఈ ఎన్నికల ప్రచారంలో తనకు ఇదే చివరి బహిరంగ సభ అని పేర్కొన్నారు. "ఈ ఎన్నికల్లో ఇదే నా చివరి సభ. మే 4వ తేదీన ఫలితాలు వెలువడిన తర్వాత జరిగే బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేను కచ్చితంగా హాజరవుతాననే పూర్తి విశ్వాసంతో తిరిగి వెళ్తున్నాను. బెంగాల్ ప్రజలు చూపిస్తున్న ప్రేమే నా ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
సభకు తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. "హెలిప్యాడ్ నుంచి ఇక్కడికి వచ్చే దారి పొడవునా వేల సంఖ్యలో ప్రజలు నన్ను ఆశీర్వదించడానికి తరలివచ్చారు. ఇంత ఉదయాన్నే ఇంత భారీ స్థాయిలో ప్రజలు వస్తారని నేను ఊహించలేదు" అని మోదీ భావోద్వేగానికి గురయ్యారు.
పశ్చిమ బెంగాల్‌లో బుధవారం చివరి విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 142 స్థానాల్లో ఓటర్లు తమ తీర్పును వెల్లడించనున్నారు. ఇప్పటికే ఏప్రిల్ 23న జరిగిన తొలి విడత (152 స్థానాలు) పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 93 శాతం ఓటింగ్ నమోదైంది. ఇదే ఉత్సాహం చివరి విడతలోనూ కొనసాగుతుందని, భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.




