PM Modi: నీట్ పేపర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే.?
PM Modi: నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
PM Modi: నీట్ పేపర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే.?
PM Modi: నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా యువత ఢిల్లీలో చేపట్టిన ర్యాలీలు, చలో సంసద్ ఉద్రిక్తతలకు దారి తీసింది. కాగా పేపర్ లీక్ అంశంపై ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలని, ఇది దేశ భవిష్యత్తుతో ముడిపడిన సమస్య అని స్పష్టం చేశారు. యువత భవిష్యత్తు, పరీక్షల భద్రతపై ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని, పేపర్ లీక్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్‌ను రాజకీయ అంశంగా మార్చకూడదన్నారు. ఇది ఒక రాష్ట్రానికి లేదా కేంద్ర ప్రభుత్వానికే పరిమితమైన విషయం కాదని, దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే జాతీయ సమస్య అని పేర్కొన్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసులో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని స్పష్టం చేశారు. యువత భద్రత, వారి భవిష్యత్తు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ఆయన చెప్పారు. అలాగే పార్లమెంట్‌లో నిర్మాణాత్మక చర్చలు జరిగేలా విపక్షాలు సహకరించాలని, రాజకీయంగా విభేదాలు ఉన్నా.. దేశ భవిష్యత్తు, యువత సంక్షేమం కోసం కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఎంపీలందరిపై ఉందని మోదీ చెప్పుకొచ్చారు.
ఢిల్లీలో ఉవ్వెత్తున్న ఎగిసిన నిరసనలు
ఇదిలా ఉంటే NEET పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో అవకతవకలకు నిరసనగా కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులు, యువత 'చలో సంసద్' పేరుతో పార్లమెంట్ వైపు భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆందోళనకారులు, ఢిల్లీ పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించి గుంపును చెదరగొట్టారు.
ఆందోళనకారులు ప్రధానంగా మూడు డిమాండ్లు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోనం వాంగ్‌చుక్‌ను డిశ్చార్జ్ చేయాలని, అలాగే NEET పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న అభ్యర్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కోరారు.
ఘర్షణలో 170 మందికి పైగా గాయాలు..
సోమవారం జరిగిన ఘర్షణల్లో ఆందోళనకారులు, పోలీసులు కలిపి 170 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. వీరికి ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. సుమారు 150 మందిని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా (RML) ఆస్పత్రికి, మరో 24 మందిని లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో చాలామందికి ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు.




