PM Modi: ప్రపంచ సమస్యలకు బ్రిక్స్‌ దేశాలు పరిష్కారం చూపాలి.. దిల్లీ సదస్సులో ప్రధాని మోదీ పిలుపు

PM Modi: దిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ కీలక ప్రసంగం.

Arun Chilukuri
Published on: 12 Sept 2026 5:47 PM IST
PM Modi: ప్రపంచ సమస్యలకు బ్రిక్స్‌ దేశాలు పరిష్కారం చూపాలి.. దిల్లీ సదస్సులో ప్రధాని మోదీ పిలుపు
X

PM Modi: ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న సంఘర్షణలకు బ్రిక్స్‌ దేశాలు సముచిత పరిష్కారం చూపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దిల్లీలోని ప్రఖ్యాత 'భారత్ మండపం' వేదికగా ప్రారంభమైన బ్రిక్స్‌ వార్షిక సదస్సు (BRICS 2026) ప్రారంభోపన్యాసంలో ఆయన మాట్లాడారు. గ్లోబల్‌ సౌత్‌ దేశాలు ఇకపై కేవలం నిబంధనలు పాటించేవిగా మాత్రమే ఉండకూడదని, ప్రపంచానికి కొత్త నియమాలు నిర్దేశించే శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ స్పేస్, బయోటెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాల్లో సభ్య దేశాలన్నీ పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో బ్రిక్స్ కూటమికి ప్రత్యేక గుర్తింపు ఉందని, అయితే ఇది ఏ ఒక్క దేశానికి వ్యతిరేకం కాదని మోదీ స్పష్టం చేశారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలకు ఒక బలమైన వ్యూహాత్మక సందేశంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

బ్రిక్స్ కూటమి ఏర్పడి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ప్రపంచ ప్రజలకు భరోసా కల్పించాలని, కష్టకాలంలో ఉమ్మడి బాధ్యతతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం ప్రపంచ పాలనా నిర్మాణం ఒక 'పిరమిడ్' లాగా ఉందని, అధికారం అంతా శిఖర భాగంలోనే కేంద్రీకృతమై ఉంటే.. దిగువన ఉన్న దేశాలు కేవలం ఆ నిర్ణయాల వల్ల ప్రభావితం అవుతున్నాయే తప్ప, వాటి రూపకల్పనలో భాగస్వామ్యం లేకపోవడం బాధాకరమన్నారు.

ప్రపంచ సంక్షోభాలు మరియు సవాళ్లను ఎదుర్కోవడంలో ముందువరుసలో ఉంటున్న గ్లోబల్ సౌత్ దేశాలు.. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మాత్రం వెనకబడి ఉన్నాయని, ఈ పరిస్థితి మారాలని కోరారు.

కాలానికి అనుగుణంగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో (UNSC) తక్షణమే సంస్కరణలు చేపట్టాలని, తద్వారా పలు వర్ధమాన దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని మోదీ స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.