PM Modi: సవాళ్లను చూసి భయపడకండి.. పరిష్కారాలపైనే దృష్టిపెట్టండి: ప్రధాని మోదీ సందేశం!

PM Modi: ఐఐటీ దిల్లీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం. సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలని విద్యార్థులకు పిలుపు.

Arun Chilukuri
Published on: 8 Aug 2026 3:20 PM IST
PM Modi
X

PM Modi: సవాళ్లను చూసి భయపడకండి.. పరిష్కారాలపైనే దృష్టిపెట్టండి: ప్రధాని మోదీ సందేశం!

PM Modi: దేశ యువతరం సామర్థ్యాలపై తనకు ఎంతో విశ్వాసముందని, ‘వికసిత్ భారత్’ స్వప్నాన్ని సాకారం చేయడంలో వారి పాత్ర ఎంతో కీలకమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐఐటీ దిల్లీ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని, విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.

వేగంగా మారుతున్న ప్రపంచంలో సాంకేతికత విస్తృతంగా రూపాంతరం చెందుతోందని ప్రధాని అన్నారు. రాబోయే 20-30 ఏళ్ల భవిష్యత్తును అంచనా వేయడం కష్టమని, అందుకే జీవితాంతం కుతూహలంతో నిత్య విద్యార్థిలా కొత్త విషయాలు నేర్చుకునే వారే విజేతలుగా నిలుస్తారని తెలిపారు.

పెద్ద సవాళ్లు ఎదురైనప్పుడు భయపడకుండా వాటిని చిన్న చిన్న భాగాలుగా విడదీసి పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. ప్రశ్నించడం కంటే సమస్యకు లభించే స్పష్టమైన పరిష్కారంపైనే దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

వచ్చే 30-35 ఏళ్లలో యువత తీసుకునే ప్రతి నిర్ణయం దేశ అభివృద్ధిని నిర్ణయిస్తుందని, తాము చేసే ప్రతి పని దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచించాలని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఐఐటీ దిల్లీ సోనిపత్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఏఐ (AI) ఆధారిత సూపర్‌ కంప్యూటింగ్‌ కేంద్రం ‘పరం ప్రజ్ఞ’ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రతిభావంతులైన విద్యార్థులకు దీన్‌దయాల్‌ శర్మ స్వర్ణ పతకం, డైరెక్టర్‌ స్వర్ణ పతకాలను అందజేశారు. మెడల్స్ సాధించిన వారిలో మహిళల సంఖ్య మరింత పెరిగితే బాగుంటుందని ఈ సందర్భంగా ప్రధాని ఆకాంక్షించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story