Narendra Modi : పరీక్షలపై మోదీ కీలక ప్రకటన.. పేపర్ లీక్‌కు చెక్.!
Narendra Modi : భారతదేశంలో తీవ్ర దుమారం రేపిన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ఘాటుగా స్పందించారు. పేపర్..
Narendra Modi
Narendra Modi : భారతదేశంలో తీవ్ర దుమారం రేపిన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ఘాటుగా స్పందించారు. పేపర్ లీకేజీలను ఒక ఘోర పాపంగా అభివర్ణించిన ఆయన, దేశంలో నీట్ లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం అత్యంత వేగంగా, కఠినంగా స్పందించిందని స్పష్టం చేశారు. మంగళవారం నిర్వహించిన ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్’ సమావేశంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వివరంగా వెల్లడించారు.
తక్షణ చర్యలు.. 13 మంది నిందితుల అరెస్ట్
నీట్ వివాదం తలెత్తిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించకుండా తక్షణ చర్యలు చేపట్టిందని ప్రధాని గుర్తుచేశారు. ఈ కుట్రలో ప్రమేయం ఉన్న ప్రధాన నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని, ప్రస్తుతం 13 మంది నిందితులు కస్టడీలో ఉన్నారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా ఉండాలంటే బాధ్యులందరికీ చట్టప్రకారం పడే కఠినమైన శిక్షే సరైన గుణపాఠంగా పనిచేస్తుందని మోదీ స్పష్టం చేశారు. కష్టపడి చదివే విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే రీ-ఎగ్జామ్ నిర్వహించి, నిర్దేశిత సమయంలోనే ఫలితాలను కూడా పారదర్శకంగా విడుదల చేసిందని వివరించారు.
పేపర్ లీకేజీలను అరికట్టడం జాతీయ బాధ్యత
భవిష్యత్తులో దేశంలో ఎలాంటి విద్యాసంస్థలు లేదా పోటీ పరీక్షల్లోనూ లీకేజీలకు తావులేకుండా పటిష్టమైన, లోపరహితమైన పరీక్షా విధానాన్ని రూపొందించుకోవడం ఒక జాతీయ బాధ్యత అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కోట్ల మంది యువత నమ్మకాన్ని, భవిష్యత్తును కాపాడటానికి ప్రభుత్వంతో పాటు అన్ని వ్యవస్థలు ఉమ్మడిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
పార్లమెంట్‌లో ప్రతిపక్షాలకు ప్రధాని విజ్ఞప్తి
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో చట్టసభలు సాఫీగా సాగేందుకు, కీలకమైన బిల్లుల ఆమోద ప్రక్రియకు ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ ఒకే తాటిపై నిలబడి ఐక్యంగా మద్దతు ఇవ్వాలని ప్రధాని కోరారు. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా పార్లమెంట్‌లో స నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా ఎన్ని అభిప్రాయ భేదాలు, విభేదాలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యంలో ఎంపీలందరికీ దేశం పట్ల ఉమ్మడి బాధ్యత ఉంటుందని గుర్తుచేశారు. రాజకీయాంశాలను పక్కనబెట్టి దేశ భవిష్యత్తు కోసం, ముఖ్యంగా యువత సంక్షేమం , వారి ఉజ్వల భవిష్యత్తు కోసం సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.




