PM Kisan 24th Instalment Released: పీఎం కిసాన్ 24వ విడత విడుదల చేసిన ప్రధాని మోదీ!
PM Kisan 24th Instalment Released: ఇరాన్ యుద్ధ వేళ విపక్షాల వదంతులపై ప్రధాని మోదీ ధ్వజం. బనస్కాంతలో పీఎం కిసాన్ 24వ విడత రూ.19 వేల కోట్ల నిధులు విడుదల.
PM Kisan 24th Instalment Released: పీఎం కిసాన్ 24వ విడత విడుదల చేసిన ప్రధాని మోదీ!
PM Kisan 24th Instalment Released: ఇరాన్ మరియు పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా తీవ్ర సంక్షోభం నెలకొన్న సమయంలో దేశంలో విపక్షాలు బాధ్యతారాహిత్యంగా వదంతులు వ్యాప్తి చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుజరాత్‌లోని బనస్కాంతలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
దేశ ప్రజల్లో లేనిపోని భయాందోళనలు, గందరగోళం సృష్టించేందుకు కొన్ని రాజకీయ వర్గాలు కుట్రలు పన్నుతున్నాయని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు అహరహం కృషి చేస్తుంటే, విపక్షాలు మాత్రం దేశ ప్రగతిని చూసి అసూయపడుతున్నాయని, దేశం ఇబ్బందుల్లో పడాలని కోరుకుంటున్నాయని దుయ్యబట్టారు.
గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అనిశ్చిత పరిస్థితులు ఏర్పడితే, దానిని ఆసరాగా చేసుకుని దేశంలో ఎరువులు, గ్యాస్ కొరత తీవ్రంగా ఉందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మోదీ మండిపడ్డారు. ప్రజలను భయపెట్టి మోదీని రాజకీయంగా దెబ్బతీయాలన్నదే విపక్షాల ప్రధాన ప్రణాళిక అని విమర్శించారు. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు విపక్షాలు సంతోషిస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ, ఆ ఆర్థిక భారాన్ని ఎక్కడా భారత్ లోని రైతులపై పడనివ్వకుండా తమ ప్రభుత్వం పూర్తి రక్షణగా నిలిచిందని ప్రధాని స్పష్టం చేశారు. రైతులకు అండగా ఉంటామని ఇచ్చిన హామీకి కట్టుబడి కేంద్రం పనిచేస్తోందని పునరుద్ఘాటించారు.
ఇదే వేదికపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (పీఎం-కిసాన్) 24వ విడత నిధులను రైతులకు విడుదల చేశారు. దాదాపు రూ. 19,000 కోట్ల భారీ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఈ 24వ విడత నిధుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 9.34 కోట్ల మంది రైతులు నేరుగా లబ్ధి పొందారని ప్రధాని మోదీ వెల్లడించారు.




