PM Modi: ఇది చరిత్ర సృష్టించే సమయం: మహిళా రిజర్వేషన్లపై మోదీ పవర్ ఫుల్ స్పీచ్..!
PM Modi: మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం. వికసిత్ భారత్ కోసం మహిళలకు అధికారం అవసరమని స్పష్టీకరణ. విపక్షాల తీరుపై మోదీ ఆగ్రహం.
PM Modi: ఇది చరిత్ర సృష్టించే సమయం: మహిళా రిజర్వేషన్లపై మోదీ పవర్ ఫుల్ స్పీచ్..!
PM Modi: దేశ చరిత్రలో ఇదొక అద్భుతమైన ఘట్టమని, మహిళలకు రాజకీయ అధికారం కల్పించడం ద్వారానే అభివృద్ధి చెందిన భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, విపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చరిత్ర సృష్టించే సమయం వచ్చింది
ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రధానంగా ఈ అంశాలను ప్రస్తావించారు. ఈ బిల్లును 30 ఏళ్ల క్రితమే ఆమోదించాల్సి ఉందని, గత ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఇంత కాలం ఆలస్యమైందని ఆయన మండిపడ్డారు. కాలానికి అనుగుణంగా మార్పులు అవసరమని, ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని అన్నారు. దేశాన్ని సరికొత్త దిశలో నడిపించడంలో మహిళల పాత్ర కీలకమని, వారికి అధికారం ఇస్తే కొత్త మార్గాన్ని చూపిస్తారని మోదీ కొనియాడారు. పంచాయతీల్లో రిజర్వేషన్లు ఉన్నప్పుడు, పార్లమెంట్‌లో ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు.
విపక్షాలకు వార్నింగ్: 'మహిళా లోకం క్షమించదు'
బిల్లు అమలు విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విపక్షాలపై ప్రధాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విపక్ష నేతలు తమ పదవులు కోల్పోతామనే భయంతోనే బిల్లును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చే వారికే భవిష్యత్తులో రాజకీయ మనుగడ ఉంటుందని హెచ్చరించారు. ఈ బిల్లు తీసుకురావడంలో ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదని, ఇది కేవలం దేశ ప్రజల కోసం, మహిళా సాధికారత కోసమేనని స్పష్టం చేశారు. మహిళలకు అన్యాయం చేసేవారిని వారు అదును చూసి దెబ్బకొడతారని ప్రధాని హెచ్చరించారు.
నేడు అన్ని రంగాల్లో మహిళలు సత్తా చాటుతున్నారని, గ్రామ స్థాయిలో మహిళలు రాజకీయాల్లో భాగం కావడం వల్ల వారికి అవగాహన పెరిగిందని ప్రధాని అన్నారు. మహిళా శక్తిని తక్కువ అంచనా వేయవద్దని, వారు చట్టసభల్లో తమ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన భరోసా ఇచ్చారు.




