PM Modi  : పేపర్ లీకేజీల పై అర్ధరాత్రి మోదీ సంచలన ప్రకటన

PM Modi  : పేపర్ లీకేజీలపై కఠిన చర్యలకు ప్రధాని మోదీ ఆదేశించారు. త్వరలో కొత్త చట్టం, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, నిందితులను వదిలిపెట్టేది లేదని అర్ధరాత్రి సందేశంలో తెలిపారు.

CR Reddy
Published on: 24 July 2026 7:07 AM IST
PM Modi
X

PM Modi

PM Modi : దేశంలో సంచలనం సృష్టిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత కఠినమైన వైఖరిని ప్రదర్శించారు. పేపర్ లీకులకు పాల్పడే దోషులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, వారిపై కఠినాతికఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల ఆందోళనలు, దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆగ్రహ జ్వాలల నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి ప్రధాని మోదీ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కేవలం 12 గంటల వ్యవధిలోనే ఈ సున్నితమైన అంశంపై ప్రధాని నుంచి రెండోసారి సందేశం రావడం ఈ వ్యవహార ప్రాధాన్యతను తెలియజేస్తోంది.

ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, కఠినమైన కొత్త బిల్లు

పేపర్ లీక్ మాఫియాను పూర్తిగా అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది. లీకేజీలకు శాశ్వతంగా చెక్ పెట్టేలా రూపొందించిన ఈ ప్రత్యేక బిల్లుపై శుక్రవారం జరిగే కేంద్ర క్యాబినెట్ భేటీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం దీనిని అతి త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తామని ప్రధాని వెల్లడించారు. అంతేకాకుండా లీకేజీ కేసుల విచారణను వేగవంతం చేసి నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చూసేందుకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు.

విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రధాని అభయం

విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "స్నేహితులారా, పేపర్ లీక్ అనేది కేవలం ఒక సాధారణ సమస్య కాదని నాకు బాగా తెలుసు. ఇది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును, వారి తల్లిదండ్రుల నిరంతర శ్రమను తీవ్రంగా గాయపరిచింది. ఇప్పటికే ఈ కుట్ర వెనుక ఉన్న ప్రధాన నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపాం. విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకూడదనేదే మా మొదటి ప్రాధాన్యత. అందుకే రద్దయిన పరీక్షలను వెంటనే తిరిగి నిర్వహించాం. కానీ అంతటితో మా బాధ్యత పూర్తి కాలేదు. గత రెండున్నర నెలలుగా ఈ అంశంపై పలు సమగ్ర చర్యలు తీసుకున్నాం, రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన నిర్ణయాలు అమలు చేస్తాం" అని అభయం ఇచ్చారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story