PM Modi: భారత్-జపాన్ బంధంలో కొత్త అధ్యాయం: జపాన్ ప్రధానిని ‘అందమైన చెల్లెలు’గా అభివర్ణించిన మోదీ!

PM Modi: భారత పర్యటనకు వచ్చిన జపాన్ కొత్త ప్రధాని సనాయె తకాయిచికి ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు.

Arun Chilukuri
Published on: 2 July 2026 3:45 PM IST
PM Modi
X

PM Modi: భారత్-జపాన్ బంధంలో కొత్త అధ్యాయం: జపాన్ ప్రధానిని ‘అందమైన చెల్లెలు’గా అభివర్ణించిన మోదీ!

PM Modi: భారతదేశ అధికారిక పర్యటనకు విచ్చేసిన జపాన్ ప్రధానమంత్రి సనాయె తకాయిచికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీలో సాదరంగా, ఘన స్వాగతం పలికారు. గురువారం ఇరు దేశాల అధినేతలు ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇరు దేశాల మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని చాటిచెబుతూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. జపాన్ ప్రధాని సనాయె తకాయిచిని తన "అందమైన చెల్లెలు" (Beautiful Sister) గా అభివర్ణించారు. భారతదేశం సాధిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక వృద్ధి ప్రయాణంలో జపాన్ పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకమైందని కొనియాడారు. సాంకేతికత, మౌలిక వసతుల కల్పనలో భారత్‌కు జపాన్ ఎల్లప్పుడూ ఒక నమ్మకమైన భాగస్వామిగా నిలిచిందని మోదీ గుర్తుచేశారు.

ప్రధాని మోదీ తనపై చూపిన ఆప్యాయత, ఆత్మీయ పిలుపు పట్ల జపాన్ ప్రధాని సనాయె తకాయిచి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మోదీ పదాలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. "భారత్, జపాన్ దేశాలు అభివృద్ధి వైపు జరుపుతున్న ప్రయాణంలో మేమిద్దరం (తాను, మోదీ) ఒకే మార్గంలో ఉన్నాం. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలు, భవిష్యత్తు ప్రణాళికలు ఒకే తీరుగా ఉన్నాయి. మా మధ్య జరిగిన సుదీర్ఘ సంభాషణల్లో ఈ విషయం స్పష్టమైంది." అని తకాయిచి పేర్కొన్నారు.

జపాన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ఇరు దేశాల అధినేతల మధ్య కుదిరిన ఈ ఆత్మీయ దౌత్యం.. రాబోయే రోజుల్లో రక్షణ, వాణిజ్య, సాంకేతిక రంగాలలో కొత్త ఒప్పందాలకు దారితీస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story