PM Modi: దేశ మహిళలకు ప్రధాని బహిరంగ లేఖ.. ఆశీస్సులు కోరిన మోదీ
PM Modi: 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
PM Modi: దేశ మహిళలకు ప్రధాని బహిరంగ లేఖ.. ఆశీస్సులు కోరిన మోదీ
PM Modi Letter to Women: దేశవ్యాప్తంగా మహిళా సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ మేరకు దేశ మహిళలను ఉద్దేశించి ఆయన ఒక భావోద్వేగ లేఖ రాశారు, దీనిని సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.
పార్లమెంట్‌లో ఏప్రిల్ 16 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ‘నారీ శక్తి వందనం అధినియమ్’ బిల్లుకు సంబంధించిన కీలక సవరణలను ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఈ ప్రక్రియలో ఏమాత్రం ఆలస్యం చేసినా అది భారత మహిళలకు అన్యాయం చేసినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు.
2023లో ప్రవేశపెట్టిన ఈ రిజర్వేషన్ బిల్లులో తాజాగా కొన్ని సవరణలు జరగనున్నాయి. లోక్‌సభలో మొత్తం సీట్లలో మూడో వంతు (1/3) మహిళలకు కేటాయించాలని నిర్ణయించారు. మొత్తం 816 లోక్‌సభ స్థానాల్లో మహిళలకు సుమారు 273 సీట్లను కేటాయించేలా చట్ట సవరణలు చేయనున్నారు.
"భారతదేశ కుమార్తెలు తమ హక్కుల కోసం జీవితాంతం నిరీక్షించడం సబబు కాదు. చట్టసభల్లో వారి గొంతు బలంగా వినిపించినప్పుడే ప్రజాస్వామ్యం దృఢంగా మారుతుంది" అని మోదీ పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ సవరణలు ఆమోదం పొందేలా దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు తమ స్థానిక ఎంపీలకు లేఖలు రాసి, వారిని సభలో పాల్గొనేలా ప్రోత్సహించాలని ప్రధాని కోరారు.




